శేరిలింగంపల్లి, అక్టోబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తొమ్మిది కాలనీల్లో రూ.4.63 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దూబే కాలనీ, డొయన్స్ కాలనీ, అలిండ్ ఎంప్లాయిస్ హౌసింగ్ కాలనీ, మసీదుబండ, ప్రభుపాద లేఅవుట్, సెంట్రల్ పార్క్ ఫేజ్-1, శిల్పా వ్యాలీ, స్ప్రింగ్ వ్యాలీ, TGHB కాలనీల్లో సీసీ రోడ్లు, పార్కుల అభివృద్ధి, శ్మశాన వాటికల ఆధునికీకరణ, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులను వెచ్చించనున్నారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. చేపట్టనున్న పనులను నాణ్యతా ప్రమాణాలతో, ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. శ్మశాన వాటికల్లో ప్రహరీ గోడలు, స్నానపు గదులు, విశ్రాంతి గదులు నిర్మించి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని, పార్కులను ఆహ్లాదకరమైన వాతావరణంతో తీర్చిదిద్ది వాకింగ్ చేసేవారికి, వృద్ధులకు, చిన్నారులకు అనువుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేని మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని గాంధీ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఇతర నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.





