శేరిలింగంపల్లి, అక్టోబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకవాదాన్ని అంతం చేద్దాం అనే నినాదంతో తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నవంబర్ 2న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరుతూ చందానగర్ డివిజన్ పరిధిలోని తారా నగర్ మార్కెట్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. అంతకుముందు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మసీదుబండ బీజేపీ కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణ, నవంబర్ 2న నిర్వహించనున్న మహా పాదయాత్ర సన్నాహకాలపై ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్చార్జి అభయ్ పాటిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి రవికుమార్ యాదవ్, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి ఆలే భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అభయ్ పాటిల్ మాట్లాడుతూ.. నవంబర్ 2న అమిత్ షా చేపట్టనున్న మహా పాదయాత్ర చారిత్రాత్మకంగా నిలవనుందని పేర్కొన్నారు. పాదయాత్రపై కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం, దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రచారాన్ని పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని సూచించారు. మహా పాదయాత్రకు లక్షలాది మంది ప్రజలు తరలిరావాలని, శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు బీజేపీ సిద్ధాంతాలను పట్టభద్రులకు వివరించాలని పిలుపునిచ్చారు.

రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి మహా పాదయాత్రకు భారీగా జనసమీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. డివిజన్, బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. పార్టీ బలోపేతంతో పాటు అమిత్ షా పాదయాత్ర నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్ రావు, అజిత్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి పద్మ, బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలు సింధు రెడ్డి, ప్రొఫెషనల్ సెల్ కన్వీనర్ బాల్దా అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





