మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు.. MCPI(U) హర్షం..

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లో ఉన్న 550.39 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై MCPI(U) పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని, దశాబ్దాలుగా సర్వే నంబర్ 100లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు చట్టబద్ధంగా ఇంటి పట్టాలు ఇవ్వాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మియాపూర్‌లోని ముజఫర్ అహ్మద్ నగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నాయకత్వం ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించింది.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని ఈ భూములు ప్రభుత్వానివేనని MCPI(U) పార్టీ నాలుగు దశాబ్దాలుగా పోరాటం చేస్తోందని నాయకులు తెలిపారు. 1986 నుంచే ప్రభుత్వ భూములను భూకబ్జాదారుల నుంచి కాపాడి పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని ఉద్యమాలు చేపట్టినట్లు గుర్తుచేశారు. కొందరు భూకబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారని ఆరోపించారు. 1994లో పార్టీ వ్యవస్థాపక నాయకుడు, అప్పటి ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ ఈ భూముల ఆక్రమణల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారని తెలిపారు. అనంతరం రఫీ మునీసా బేగం, రహీమున్నీసా బేగం వారసుల మధ్య భూమి యాజమాన్య వివాదం వెలుగులోకి వచ్చిందని, వివిధ ప్రైవేట్ సొసైటీలకు భూములు విక్రయించినట్లు పేర్కొన్నారు. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ భూములు ప్రభుత్వానివేనని తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. భూముల పరిరక్షణలో భాగంగా స్టాలిన్ నగర్, ముజఫర్ అహ్మద్ నగర్ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు మద్దికాయల ఓంకార్, తాండ్ర కుమార్ నాయకత్వంలో పోరాటాలు జరిగాయని తెలిపారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వ భూములపై స్పష్టత రావడం సంతోషకరమని అన్నారు.

అయితే, ఈ భూములను విక్రయించి ప్రజా పాలన కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం విచారకరమని MCPI(U) నాయకులు అభిప్రాయపడ్డారు. ఇంతటి విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు, పెట్టుబడిదారులకు అప్పగించకుండా ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని భూములను పరిరక్షించాలని, పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజలకు భూమి దక్కే వరకు MCPI(U) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో MCPI(U) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వనం సుధాకర్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్, సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, కార్యదర్శివర్గ సభ్యులు ఇస్లావత్ దశరథ్‌ నాయక్, పల్లె మురళి, కమిటీ సభ్యులు జి. శివాని, బి.కె. నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here