శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మిదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చండీహోమం ఘనంగా నిర్వహించారు.

శేరిలింగంపల్లి డివిజన్ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, ప్రవళిక దంపతులు హోమం ఆచరించారు. డివిజన్ ప్రజలు కరోనా మహమ్మారి నుండి విముక్తులై సుఖశాంతులతో వర్ధిల్లాలని వారు దేవుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చింతకింది డాకయ్య గౌడ్, అమృత దంపతులతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ మహాలక్ష్మీ దేవి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.






