ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే

నమస్తే శేరిలింగంపల్లి: ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఎకడమిక్ స్టాఫ్ కాలేజీలో కన్వీనర్ తాడి బోయిన రామస్వామి యాదవ్ సమక్షంలో జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి సి రాయ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్య అతిథులుగా స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డీన్ డాక్టర్ గీతా వేముగంటి, కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ పాపారావు, ఎకడమిక్ స్టాఫ్ కాలేజీ డైరెక్టర్ ఆచార్య నరసింహులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యో నారాయణ హరిః అనే నానుడిని వైద్యులు నిజం చేస్తున్నారన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు తమ సేవల ద్వారా పునర్జన్మని ఇస్తారన్నారు. ఈ సమాజంలో కులమత ప్రాంతాలకతీతంగా గౌరవించే వృత్తి అధ్యాపకులతో పాటు వైద్య వృత్తి అన్నారు. డాక్టర్ బి సి రాయ్ స్వాతంత్ర సమరయోధులుగా, వైద్యుడిగా, ఉపకులపతిగా, వెస్ట్ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారని పేర్కొన్నారు. బిసి రాయ్ హయాంలో అనేక వైద్య సంస్థలు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. వైద్యుల లక్షణం నిబద్ధత, త్యాగనిరతి అనే పదాలకు ఆయన నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ రోజు నాలుగు గంటలు వైద్య వృత్తిలో సేవలందించారని చెప్పారు. భారత ప్రభుత్వం డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ ని భారతరత్న బిరుదు తో సత్కరించిందని తెలిపారు. ఆయన గౌరవార్థం 1991 నుంచి జూలై 1 ని కేంద్ర ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ వైద్యుల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

వైద్యులను సన్మానిస్తున్న ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్

ఆయా రంగాలలో సేవలు అందించిన వారికి డాక్టర్ బి సి రాయ్ పేరు మీద నేషనల్ అవార్డ్స్ ప్రధానం చేస్తున్నారని చెప్పారు. నేటి వైద్యులు డాక్టర్ బి సి రాయ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, వైద్య వృత్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. రోగుల పట్ల సేవా దృక్పథంతో సేవలందించాలన్నారు. అనంతరం బాలకృష్ణ యాదవ్, టి రాఘవేంద్రరావు సౌజన్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ కు చెందిన 30 మంది వైద్యులను శాలువా, జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డాక్టర్స్ ఫోరం కన్వీనర్, హెచ్ సీ యూ సీఎంఓ డాక్టర్ రవీంద్ర కుమార్ , బాలక్రిష్ణ యాదవ్, రాఘవేంద్ర రావు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గంగాధర్, కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వర రాజు, జివి రావు, విష్ణు ప్రసాద్, జనార్ధన్, విజయలక్ష్మి , సురేష్ బాబు , శివరామకృష్ణ, రజిని, వెంకటేశ్వరరావు, రాణి, ఉమా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here