నమస్తే శేరిలింగంపల్లి: బీహెచ్ఈఎల్ యాజమాన్యంతో భారతీ నగర్, రామచంద్రపురం డివిజన్ల ప్రజల సమస్యల పరిష్కారంపై నెలకొన్న వివాదంపై సమన్వయంతో పనిచేసి, త్వరలోనే ఇరుపక్షాల అంగీకారంతో సమస్యలను పరిష్కరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. బీహెచ్ఈఎల్ ప్రధాన కార్యాలయంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరదరాజన్ తో మెదక్, చేవెళ్ల ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, ఆరెకపూడి గాంధీ, శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, భారతి నగర్, రామచంద్రాపురం కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్ సమావేశం అయ్యారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజి, మ్యాక్ సొసైటీ, హెచ్ ఐ జి కాలనీలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు చేపట్టిన పనులకు బిహెచ్ఎల్ యాజమాన్యం ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేస్తూ బిహెచ్ఎల్ భూములను కబ్జా చేస్తుందంటున్న యాజమాన్య ప్రతినిధుల సందేహాలు పూర్తిగా అవాస్తవమని ప్రజాప్రతినిధులు తెలిపారు. సమాచార లోపంతో సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.
ప్రధానంగా హెచ్ఐజి, ఆర్ ఆర్ నగర్ కాలనీ లో అదనంగా ఉన్న భూమిపై ఇరుపక్షాల అంగీకారం కుదిరే వరకూ బీహెచ్ఈఎల్ కి చెందినది అని బోర్డులు ఏర్పాటు చేయవద్దని కోరారు. ఎంఐజి, మ్యాక్ సొసైటీ, హెచ్ఐజి కాలనీలోని బీహెచ్ఈఎల్ సంస్థ స్థలంలో మంజీరా పైప్ లైన్ వేసేందుకు అనుమతించాలన్నారు. భారతీయ విద్యా భవన్ పాఠశాలలో స్థానికులకు కొన్ని సీట్లు కేటాయించాలని, అన్నమయ్య కాలనీ నుండి ఇక్రిశాట్ ఫెన్సింగ్ వరకు చెత్తను పూర్తిగా తొలగించి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. హిందూ, క్రిస్టియన్ స్మశాన వాటికల సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి బీహెచ్ఈఎల్ యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని, త్వరలో మరోసారి యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలిపారు.