నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దమయ్యే పేద విద్యార్థుల కోసం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని పేద నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం సన్నద్దమయ్యేందుకు ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. శిక్షణలో మోటివేషన్ అంశాలపై వివరించారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నాణ్యమైన విద్య బోధన కు వివిధ రంగాలలో అనుభవజ్ఞులైన నిపుణుల తో బోధిస్తున్నామన్నారు. ఉద్యోగం సాధించే క్రమంలో యువతకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశ్యంతో ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు.