నమస్తే శేరిలింగంపల్లి: వేసవి కాలం దృష్ట్యా, మండుతున్న ఎండలతో పక్షులు దాహానికి తల్లడిల్లి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని ఏవైయూవి స్టూడెంట్స్ యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రోహిత్ ముదిరాజ్ అన్నారు. పక్షుల దాహార్తిని తీర్చేలా యూత్ ఫౌండేషన్ ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. యూత్ ఫౌండేషన్ సభ్యులందరం తమతమ ఇళ్లల్లోని బాల్కనీలో, గార్డెన్స్ లో, బిల్డింగ్ ల పై కుండలను ఏర్పాటు చేసి నీటిని నింపి పక్షులు తాగేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని తీర్మానించుకున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్క సభ్యుని నుంచి మంచి స్పందన వచ్చిందని, పక్షుల కోసం నీటి కుండలను ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ వేసవి కాలంలో పక్షుల కోసం నీటి వసతి కల్పించి పక్షులను కాపాడుకోవాలని రోహిత్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.