- రాయదుర్గంలో నేపాలీ గ్యాంగ్ భారీ దోపిడీ
- పనిమనుషులుగా చేరి ఇంటిని దోచుకున్న వైనం
- యజమాని కుటుంబానికి మత్తుమందు ఇచ్చి 45 లక్షల విలువైన బంగారం, డబ్బు అపహరణ
గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): ఇంట్లో పని చేస్తామంటూ వచ్చారు. కొంతకాలం నమ్మకంగా పని చేశారు. అదును చూసుకుని తిన్నింటి వాసాలే లెక్కపెట్టారు ఆ నేపాలీ గ్యాంగ్. యజమాని కుటుంబానికి ఆహారంలో మత్తుమందు పెట్టి ఇంట్లో ఉన్న డబ్బు బంగారాన్ని దోచుకెళ్లారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు కథనం ప్రకారం…
రాయదుర్గం పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్ లో గూడూరు మధుసుధన్ రెడ్డి తన భార్య శైలజ, కుమారుడు నితీష్ రెడ్డి, కోడలు దీప్తి, మనుమడు అయాన్ లతో నివసిస్తున్నారు. పదినెలల క్రితం నేపాల్ ప్రాంతానికి చెందిన రవి, అతని చెల్లెలు సీత, మనోజ్, మనోజ్ భార్య జానకి లు మధుసూదన్ రెడ్డి ఇంట్లో పనికి చేరారు. ఇంట్లో నమ్మకంగా పనిచేస్తూ అనుమానం రాకుండా మెలిగారు. కాగా సోమవారం రాత్రి మధుసూదన్ రెడ్డి కుటుంబం చేసే భోజనంలో పథకం ప్రకారం మత్తుమందు కలిపారు. భోజనం అనంతరం వారంతా నిద్రలోకి జారుకోగానే ఇంట్లో ఉన్న 15 లక్షల నగదు, 30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. మత్తు నుండి తేరుకుని విషయం గ్రహించిన మధుసూదన్ రెడ్డి పోలీసులకు పిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా మదుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూకట్ పల్లి లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.