- ఐదెళ్ల చిన్నారిని ఊపిరాడకుండా చేసి హతమార్చిన తల్లి
- చందానగర్ శివాజీనగర్‌లో వెలుగుచూసిన ఘటన
నమస్తే శేరిలింగంపల్లి: దుర్వసనాలు, చెడు సావాసాలకు అలవాటు పడిన ఓ తల్లి ఐదేళ్ల తన సొంత కూతురుని ఊపిరి ఆడకుండా చేసి హతమార్చిన ఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపిన వివరాల ప్రకారం… చందానగర్ శాంతీనగర్‌కు చెందిన వడ్డె యాదమ్మ(30) రాములుకు 2011లో వివాహం జరిగింది. వారికి నలుగురు సంతానం కాగా అందులో ఇద్దరు అనారోగ్యంతో మృతిచెందారు. 2013 నుంచి వారు శివాజీనగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటు స్థానికంగా కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. ఐతే గత మూడేళ్లుగా యాదమ్మ మద్యానికి బానిస అయ్యింది. తరచూ కల్లు తాగడంతో పాటు పరాయి వ్యక్తులతో లైంగిక సంబంధాలు కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే భర్తతో గొడవ జరగడంతో ఇటీవల రాము తన స్వస్థలానికి వెళ్లాడు. తన అక్రమ సంబంధాలకు అడ్డుస్తుందని బావించిన యాదమ్మ గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తన కూతురు కృష్ణవేణి(5)ని ఊపిరాడకుండా చేసి చంపేసింది. కొంత సమయానికి యాదమ్మ తల్లి తిమ్మమ్మ అక్కడకు వచ్చింది.
ఇంటి యజమానిపై నెపం వేసి అడ్డంగా దొరికిపోయారు…
తల్లీ కూతుర్లు తిమ్మమ్మ, యాదమ్మలు కలసి ఒక పథకం వేశారు. కృష్ణవేణి హత్యకు వారు నివాసం ఉండే ఇంటి యజమాని సురేష్ కారణమని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే సురేష్ ఇంట్లోకి వెళ్లి టీవీ, ఫర్నీచర్ ద్వంసం చేశారు. విషయం తెలుసుకున్న రాము చందానగర్ పోలీసులను ఆశ్రయించాడు. తన బిడ్డ చావుకు తన భార్య యాదమ్మ, అత్తమ్మ తిమ్మమ్మలపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్టుమార్టం కొంసం చిన్నారి మృతదేహాన్ని గాంధీ దవఖానాకు తరలించారు. ఐతే పోస్టుమార్టం రిపోర్టులో కృష్ణవేణి ఊపిరి ఆడకుండా చేయడం వల్లే మృతిచెందిందని తేలింది. దీంతో యాదమ్మ, తిమ్మమ్మలను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరం ఒప్పుకుంది. దీంతో వారిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.