శేరిలింగంపల్లి, నవంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): మతి స్థిమితం సరిగ్గా లేని వ్యక్తి అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వరంగల్ జిల్లా నరసింహులు పేట మండలం పెద్దనగరం గ్రామానికి చెందిన వెంకన్న (44) తన భార్య అజ్మీరా కాలాతో కలిసి 10 ఏళ్ల కిందట బతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ హుడా కాలనీలో నివాసం ఉంటూ స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా వెంకన్నకు 2 ఏళ్ల కిందట యాక్సిడెంట్ జరగడంతో మతి స్థిమితం కోల్పోయాడు. అప్పటి నుంచి అతను ఇంట్లోనే ఉంటున్నాడు. భార్య అజ్మీరా కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 18వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంకన్న తిరిగి రాలేదు. దీంతో అజ్మీరా చుట్టు పక్కల, తెలిసిన వారు, బంధువులు, స్నేహితుల దగ్గర భర్త ఆచూకీ కోసం విచారించింది. అయినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతను అదృశ్యం అయినప్పుడు మెరూన్ కలర్ షర్ట్, జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు ఉంటాడని, తెలుగు, హిందీ, లంబాడీ భాషలు మాట్లాడగలడని, ఎవరైనా అతన్ని గుర్తిస్తే చందానగర్ పోలీసులను సంప్రదించాలని కోరారు.