శేరిలింగంపల్లి, నవంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును చందానగర్ పోలీసులు రట్టు చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ వేముకుంటలో ఉన్న న్యూ డ్రీమ్ స్పా అండ్ సెలూన్లో వ్యభిచారం జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ శ్యామ్ ప్రసాద్ ఇతర పోలీసు సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో మొత్తం ఆరు మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు విటులు, ఇద్దరు మహిళలతోపాటు స్పా యజమాని రామకృష్ణ, అందులో పనిచేసే కరుణ శ్రీ అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా సదరు స్పా సెంటర్లో మసాజ్ పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. మసాజ్ పేరిట యజమాని రామకృష్ణ, ఉద్యోగిని కరుణ శ్రీ అందులో పనిచేసే మహిళా సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి వారిని వ్యభిచారం చేయమని ప్రోత్సహిస్తున్నారని, దీంతో అదనపు ఆదాయం వస్తుందని చెప్పి వారితో వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు. వారిని ఈ మేరకు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.