నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గంగారం చెరువు వద్ద గల వినాయక నిమజ్జన కోనేరును భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ జ్ఞానేంద్ర ప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధి పేరుతో చెరువులో నీరు లేకుండా చేశారన్నారు. ఇటీవల అధికారుల సమావేశంలో చెరువులో నీరు ఉండేలా చూడాలని తెలిపినట్లు చెప్పారు. గంగారాం చెరువులోని కోనేరులో గణేష్ నిమజ్జనానికి నీటి సౌకర్యం లేకపోతే ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉందని వెంటనే అధికారులు చర్యలు తీసుకొని యుద్ధప్రాతిపదికన నిమజ్జన కోనేరులో నీరు నింపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కోటేశ్వరరావు, నందు, నర్సింహా, మహేష్, తదితరులు పాల్గొన్నారు.