నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్, హఫీజ్‌పేట్ డివిజన్ ప్రజలకు పూర్తిస్థాయిలో మౌళిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్‌గౌడ్ అన్నారు. గురువారం మాదాపూర్ డివిజన్ అరుణోదయ కాలనీలో నెలకొన్న భూగర్భ డ్రైనేజీ సమస్యతో పాటు చేపట్టాల్సిన సిసిరోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం హఫీజ్‌పేట్ డివిజన్ మంజీర రోడ్డులో భూగర్భ డ్రైనేజీ సమస్యను స్థానికులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ మాదాపూర్, హఫీజ్‌పేట్ డివిజన్ల పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీలలో ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే భూగర్భ డ్రైనేజీ సమస్యను పరిష్కరించి సిసిరోడ్ల పనులు ప్రారంభమయ్యేలా అధికారులతో చర్చిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ కాలనీ అధ్యక్షులు వసంత్, సత్యనారాయణ, జి.హెచ్.ఎం.సి వర్క్ ఇన్స్పెక్టర్ చారి, బాలు స్థానికులు ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.