ఈ గర్భనిరోధక పద్ధతుల గురించి మీకు తెలుసా…?

  • సెప్టెంబరు 26 గర్భనిరోధక సాధన దినం
  • అవగాహన లేకుండా నిరోధకాలతో అనర్ధాలు

జనాభా సంఖ్యలో ఇప్పటికే భారత దేశం రెండవ స్థానంలో ఉండి మొదటి స్థానం దక్కించుకోవడానికి ఉరకలు వేస్తుందనే చెప్పవచ్చు. ఇలా పెరుగుతున్న జనాభా మరియు దానిని ఎలా నియంత్రించాలనే అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ అంశంపై వైద్య నిపుణులు, ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించి అనవసర గర్భాలను అడ్డుకోవడానికి ఉన్న మార్గాలేమిటనే అంశంపై సూచనలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ అవాంఛిత గర్భాలను నియంత్రించడంలో పలు సామాజిక, మతపరమైన కారణాలతో మన దేశం విఫలమవుతూనే ఉంది. అంతే కాకుండా గర్భ నిరోధక సాధనాలపై ఉన్న పలు అపోహల కారణంగా కూడా వీటి వినియోగం సరిగ్గా జరుగడం లేదు. ఇందుకు అవగాహన లేమి ప్రధాన కారణం. ఇలాంటి అపోహలను తొలగించి ప్రజలలో గర్భనిరోధక సాధనాలపై సరైన అవగాహన కలిపించి తద్వారా వాటి సరైన
వినియోగానికి వీలు కలిపించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 26 సెప్టెంబర్ ను ప్రపంచ గర్భనిరోధక సాధన దినంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గర్భ నిరోధక సాధనమంటే ఏమిటి, దానిలోని రకాలు, వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక కథనం…

గర్భనిరోధకమంటే ఏమిటి, అది ఎలా పని చేస్తుంది…?

గర్భ నిరోధకమంటే ఒక పద్ధతి ద్వారా గర్భం రాకుండా అడ్డుకోవడం. ఇలా గర్భాన్ని అడ్డుకోవడానికి ఎన్నో పద్దతులు, సాధనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం సాధనాలు, మందులతో పాటూ లైంగిక చర్య లో కొన్ని మార్పుల మద్దతును తీసుకొనడం జరుగుతోంది. ఇందులో ఏదైనా గాని అవి పురుషుని ద్వారా విడుదలయ్యే వీర్య కణాలను మహిళ అండాశయం విడుదల చేసే అండాలతో
కలువకుండా నిలుపదల చేసి తద్వారా అవాంఛిత గర్భాన్ని నిరోధిస్తాయి. అంతే గాకుండా అండాన్ని, వీర్య కణాలను విడివిడిగా నిలిపి పెట్టి తద్వారా ఫలదీకరణ జరుగకుండా ఆపుతాయి. దీంతో పాటు కొన్ని సాధనాలు మరింత ముందడుగు
వేసి ఫలదీకరణ చెందిన అండాలు గర్భాశంలోనికి వెళ్లకుండా నిరోధించి వాటిని చంపివేస్తాయి. ఇక కండోమ్, కాపర్ టి లాంటి సాధనాలు పురుషుని వీర్యకణాలను మహిల యోనిలోనికి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి.

వివిధ రకములైన గర్భ నిరోధక సాధనములు

సహజ పద్ధతులు:

క్యాలెండర్ పద్ధతి: సాధారణంగా మహిళలలో ఉండే 30 రోజుల పీరియడ్ క్యాలెండర్ లో మద్య పది రోజులు గర్భం ధరించడానికి వీలుగా ఉంటుంది. ఈ పది రోజులలో లైంగిక చర్యలో పాల్గొనకుండా జంటలు చూసుకుంటే గర్భాన్ని
నిరోధించవచ్చు. అయితే ఈ విధానాన్ని అనుసరించాలనుకొంటే మాత్రం ప్రతి రోజు మహిళల పీరియడ్ కాలెండర్ ను పరిశీలిస్తూ ఏ మాత్రం మార్పు సంభవించినా గమనించాలి.

కాయిటస్ ఇంటరప్ట్ (Coitus Interuptus) ఈ పద్దతిలో లైంగిక చర్యలో పాల్గొంటున్న పురుషుడు వీర్యం స్ఖలించే ముందు తన పురుషాంగాన్ని యోని నుండి తీసివేయడం ద్వారా వీర్యాన్ని యోనిలో విసర్జన కాకుండా అడ్డుకోవడం.

ల్యాక్టేషనల్ అమెనోరియా(Lactational Amenorrhea) (LAM): మహిళలు చిన్నారులకు రొమ్ము ద్వారా పాలు పడుతున్న వేళ గర్భం  వచ్చే అవకాశం లేదు. అయితే రోజుకు నాలుగు నుండి ఆరు గంటల పాటు పాలు పడుతుండాలి.

కృత్రిమ పద్ధతులు:

అడ్డు లేదా తొడుగు సాధనాలు: కండోమ్, వాజినల్ డయాఫ్రం వంటి తొడుగులను వినియోగించి పురుషుల వీర్యకణాలు మహిళల అండాశయ నాళాలోనికి ప్రవేశించకుండా అడ్డుకొని తద్వారా వాటిని అండాలతో కలువకుండా
చూస్తారు. అయితే ఇలాంటి సాధనాలను ప్రతి లైంగిక చర్య సమయంలో మార్చి నూతన తొడుగు
వినియోగించాల్సి ఉంటుంది.
యోనిలో వినియోగించే రింగ్ లు (నూవా రింగ్): హార్మోన్ మందులు పూయబడిన రింగులను వినియోగించడం ద్వారా మహిళలలో విడుదల అయ్యే అండాలతో వీర్య కణాలు కలువకుండా చేయడమే కాకుండా మహిళల ద్వారా అండాల విడుదల ఆలస్యం చేయడం కానీ, అడ్డుకోవడం జరుగుతుంది. అయితే ఈ రింగ్ ను నెలలో రెండుసార్లు మార్చాల్సి వస్తుంది.


స్పెర్మిసైడ్స్: స్పెర్మిసైడ్స్ అనబడే ఆయింట్మెంట్ లను స్త్రీ యోనికి రాయడం ద్వారా యోనిలోనికి వచ్చే వీర్యకణాలంటీని చంపివేయడం జరుగుతుంది. అయితే లైంగిక చర్యలో పాల్గొన్న ప్రతి సారీ ఈ ఆయింట్మెంట్ ను వినియోగించాల్సి ఉంటుంది.
గర్భనిరోధక స్పాంచ్: స్పైర్మీసైడ్స్ ఆయింట్మెంట్ ను కలిగిన స్పాంట్. దీని ద్వారా ఆయింట్మెంట్ ను రాయడం జరుగుతుంది.

ఇంప్లాంట్లు లేదా గర్భాశంలోనికి ప్రవేశపెట్టే సాధనాలు

ఇంప్లాంట్లు (నియోప్లాంట్స్): మందులు రాయబడిన అతి చిన్న రాడ్ లను యోనిలోని చర్మంలో ప్రవేశపెడుతారు. ఇవి విడుదల చేసే మందుల కారణంగా గర్భాశయ శ్లేష్మం మందంగా మారడం ద్వారా వీర్య కణాలు గర్భాశయ కుహరంలోనికి ప్రవేశించకుండా అడ్డుకోవడంతో పాటూ అండాలు విడుదల కాకుండా ఆపుతాయి. ఈ సాధనాల ద్వారా మూడు సంవత్సరముల పాటూ అవాంఛిత గర్భాన్ని అడ్డుకోవచ్చు.
ఇంట్రాడెర్మల్ పాచెస్: హార్మన్ మందులను పూయబడిన పాచ్ లను చర్మానికి అంటించడం జరుగుతుంది. ఈ పాచ్ లో ఉంటే మందులు అండాలు విడుదల కాకుండా అడ్డుకుంటాయి. అయితే ఈ పాచ్ లను వారానికి ఒకసారి మార్చుకోవాలి.

కాపర్ టి: కాపర్ టి అనబడే పరికరాన్ని గర్భాశయ కుహరం లో ప్రవేశపెడుతారు.
ఇలా ఉపయోగించే పరికరాన్ని మూడు లేదా ఐదు లేదా పది సంవత్సరములు వినియోగంలో ఉండేలా వాడుతారు. ఈ పరికరం యోనిలోనికి వచ్చే వీర్య కణాలను పూర్తిగా ద్వంసం చేస్తుంది.
దీంతో పాటూ హార్మోన్ ల మందులను రాయబడిన చిన్న సాధనాన్ని గర్భాశయ కుహరంలోనికి ప్రవేశ పెట్టడం ద్వారా పురుషుల వీర్య కణాలను డ్డుకోవడమే కాకుండా మహిళల అండాలు విడుదల కాకుండా చేస్తుంది. దీన్ని
8 సంవత్సరముల పాటూ వినియోగించుకోవచ్చు.

నోటి ద్వారా లేదా ఇంజెక్షన్ల ద్వారా తీసుకొనే గర్భనిరోధక మందులు

నోటి ద్వారా తీసుకొనే గర్భనిరోధక మాత్రలు: వైద్యులు సూచించిన మేరకు కొన్ని రకములైన మందులను మేళవించి మహిళల రుతుస్రావ కాలెండర్ లో 5 వ రోజు నుండి 21 వ రోజు వరకూ వీటిని వినియోగించడం జరుగుతుంది. ఎటువంటి లోపం, నిర్లక్ష్యం లేకుండా వీటిని వినియోగిస్తే ఇవి 99 శాతం నుంచి ఫలితాలనిస్తాయి. అయితే వీటిని కేవలం వైద్య నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.
ప్రోజిసైరన్ (Progesyeran) మాత్రలు: ఇవి కూడా నోటి ద్వారా తీసుకొనే మాత్రలే. వీటిని కూడా మహిళల పీరియడ్స్ క్యాలెండర్ లో 5 రోజు నుండి 21 ఎ రోజు వరకూ వినియోగిస్తారు. వీటి వినియోగం కారణంగా గర్భాశయం శ్లేషం మందంగా మారి పోయి వీర్య కణాలు అండాశయం లోనికి ప్రవేశించకుండా అడ్డుకోవడమే కాకుండా మహిళల అండాల విడుదలను నిలుపుదల చేస్తాయి. అత్యవసర పరిస్థితులలో వినియోగింటే గర్భనిరోధక మాత్రలు: మార్కెట్ లో పలు పేర్లతో అందుబాటులో ఉంటే ఈ మాత్రలను సురక్షితం కాని లైంగిక చర్యకు పాల్పడిన మూడు రోజులలోగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటి కారణంగా మహిళలలో అండాలు విడుదల ను అడ్డుకోవడం లేదా ఆలస్యం చేయడం ద్వారా అవాంఛిత గర్భాన్ని అడ్డుకోవడం జరుగుతుంది.

ఇంజెక్షన్ల ద్వారా తీసుకొనే గర్భనిరోధక మందులు: డిపో ప్రైవెరా అనబడే ఇంజక్షన్లను ప్రతి మూడు నెలల కొకసారి మూడు సార్లు లేదా నెల కొక సారి వైద్యులు సలహా మేరకు తీసుకోవాల్సి ఉంటుంది. వీటి వినియోగం వలన
కూడా గర్భాశయం శేషం మందంగా మారి పోయి వీర్య కణాలు అండాశయం లోనికి ప్రవేశించకుండా అడ్డుకోవడమే అందాల విడుదలను నిలుపుదల చేస్తాయి.

శస్త్ర చికిత్స ద్వారా నిరోధించడం

ఓపెన్ లేదా లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమి : ట్యూబెక్టమీ అన్న శస్త్ర చికిత్స ను ఓపెన్ పద్దతి లేదా ల్యాప్రోస్కోపిక్ విధానాన్ని వినియోగించి చేయడం ద్వారా మహిళలలో గర్భం రాకుండా నిరోధిస్తారు. ఈ శస్త్ర చికిత్సలో మహిళల
ద్వారా విడుదల అయ్యే అండాలు వచ్చే నాళాలలో అడ్డు వేయడం ద్వారా అవి విడుదల కాకుండా చేస్తారు.
వాసెక్టమి: పురుషులలో వీర్య కణాలను విడుదుల చేసే నాళాలకు ముడి వేయడం ద్వారా వీర్య కణాలు విడుదల కాకుండా చూస్తారు.

గర్భనిరోధక సాధనాల దుష్ప్రభావాలు

లైంగిక చర్యలలో మార్పులతో ఉండే సహజ గర్భనిరోధకాలైన క్యాలెండర్ మెథడ్, ల్యామ్ వంటి పద్ధతులతో ఎటువంటి దుష్పలితాలు ఉండవు. అయితే కండోమ్ వంటి తొడుగులు వినియోగించినపుడు జంటలలో అలర్జీ రియాక్షన్లు రావడం, లైంగికాంగాలలో దురద, గమనించవచ్చు. యోని లో ఇన్ఫెక్షన్, మూత్ర నాళాలలో ఇన్ఫెక్షన్ ల వంటివి అయితే గర్భాశయ భాగాలలో ప్రవేశ పెట్టి సాధనాల కారణంగా మొదట్లో మూడు లేదా ఆరు నెలల కాలంలో పీరియడ్స్ గతి తప్పడంతో పాటు ఎక్కువ కాలం రుతుస్రావం ఉండడం, పొత్తి కడుపులోముడతలు కూడా గమనించవచ్చు. ఇక నోటి ద్వారా లేదా ఇంజెక్షన్ల ద్వారా తీసుకొనే మందులను పద్ధతి ప్రకారం వినియోగించడం వలన కొన్ని ఇతరత్రా సమస్యలు ఏర్పడవచ్చు. అందుకే వీటిని కేవలం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి.

వివిధ గర్భనిరోధక సాధనాల  వైఫల్యాలు..

పైన తెలిపిన గర్భ నిరోధక సాధనలు నూటికి నూరు శాతం నిరోధిస్తాయని చెప్పలేం. ఒక్కో పద్దతిలో గల వైఫల్యాల గణాంకాలు ఇలా ఉన్నాయి. ఇంప్లాంట్స్ లో ఎక్కువ శాతం 0.5 శాతం విఫలం కావచ్చు. అలానే గర్భాశయ భాగాలలో ప్రవేశ పెట్టి సాధనాలలో కూడా 0.2 శాతం నుండి 0.8 శాతం సందర్భాలలో వైఫల్యాలు ఎదురుకావచ్చు. ఇక పురుషులలో నిర్వహించే వాసెక్టమి లో 0.15 శాతం మరియు మహిళలలో నిర్వహించే ట్యూబెక్టమీ శస్త్ర చికిత్సలో 0.5 శాతం కేసులలో వైఫల్యం ఎదురుకావచ్చు. అయినప్పటికీ ఈ సాధనాలన్నింటిలోనూ 99 శాతం ఖచ్చితంగా అవాంచిత గర్భాన్ని నిరోధించవచ్చు. ఇక పురుషులు కండోమ్ లు వినియోగించే సందర్భాలలో 18 శాతం మరియు మహిళలు వినియోగించే కండోమ్ లలో 21 శాతం సమయాలలో వైఫల్యాలను గమనించవచ్చు. ఇక ఇతర సాధనాలైన కాయిటస్ ఇంటరప్ట్ విధానంలో 22 శాతం, గర్భనిరోధక స్పాంజ్ వినియోగ సందర్భాలలో 24 శాతం, స్పెర్మిసిడియల్ జెల్లీ లేదా ఆయింట్మెంట్ వినియోగ సందర్భాలలో 28 శాతం, క్యాలెండర్ పద్ధతిలో 24 శాతం వైఫల్యాలను గమనించవచ్చు అంటే ఈ పద్ధతులలో 70 నుంచి 80 శాతం మాత్రమే విజయవంతంగా అవాంఛిత గర్భాన్ని నిరోధిస్తున్నాయని చెప్పవచ్చు. ఇక నోటి ద్వారా లేదా ఇంజెక్షన్స్ ద్వారా గర్భ నిరోదక మందులను వినియోగించినపుడు 6 నుండి 8 శాతం వైపల్యాలను పరిశోధకులు గమనించారు.


అవాంఛిత గర్భాలను నిరోధించాలనుకొనే జంటలకు ఇప్పుడు ఎన్నో గర్భనిరోధక సాధనాలు, విధానాలు అందుబాటులో ఉన్నాయి. అందుచేత తమకు తాముగా ఏదో పద్దతిని వినియోగించే ముందు వైద్యులను సంప్రదించి తమ పరిస్థితులు
లేదా ఆరోగ్య స్థితిగతులకు అనుగుణంగా వారి వారి అవసరాలకు పనికొచ్చే విధానాన్ని లేదా సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. అంతే గాకుండా ఎంపిక చేసిన విధానాం లేదా పద్దతి లేదా సాధనాన్ని వినియోగించుకొనే సందర్భంలో వాటి
ఉపయోగంపై సూచించిన నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అపుడు మాత్రమే వైఫల్యానికి తావు లేకుండా అవాంచిత గర్భాన్ని అడ్డుకోగలుగుతారు. దేశంలో నానాటికీ పెరుగుతున్న జనాభా కారణంగా ఏర్పడుతున్న సామాజిక, ఆర్ధిక సమస్యలను సమాధానమివ్వాలంటే గర్భనిరోధక సూత్రాలను అవలంబించడమే సరైన పరిష్కారం. తద్వారా దేశ సమస్యలనే కాకుండా వారి వారి వ్యక్తిగత
సమస్యలకు కూడా సమాధానం దొరుకుతుంది.

Dr.T.Sumana


The article is prepared by Dr T Sumana, Obstetrician & Gynecologist, Apollo Clinics, Nizampet, Hyderabad

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here