మియాపూర్‌ లో కంపిస్తున్న అపార్ట్‌మెంట్ బ్లాకులు… భ‌‌యాందోళ‌న‌లో స్థానికులు

మియాపూర్‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని న‌రేన్ గార్డెన్ స‌మీపంలోని ఓ అపార్ట్‌‌మెంట్లో ప‌లు బ్లాకులు కంపిస్తున్నాయ‌ని స్థానికులు పేర్కొంటున్నారు. అపార్ట్‌మెంటును ఆనుకుని జ‌రుగుతున్న‌ భారీ భ‌వ‌న నిర్మాణ ప‌నులే కార‌ణ‌మ‌వ్వ‌చ్చ‌నే అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఏ క్ష‌ణంలో ఏం జ‌రుగుతుందో అనే భ‌యంతో స్థానిక ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే… మియాపూర్ బొల్లారం రోడ్డులో గ‌ల న‌రేన్ గార్డెన్ స‌మీపంలో కొద్ది రోజులుగా ఓ భారీ అపార్ట్‌మెంట్ నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ నిర్మాణ ప‌నుల‌ను ఆనుకుని ఉన్న మ‌రో అపార్ట్‌మెంట్లో ప‌లు బ్లాకులు గ‌త వారంలో నాలుగైదు సార్లు కంపించిన‌ట్లు స్థానికులు తెలిపారు.

అపార్ట్‌మెంట్‌ను ఆనుకుని జ‌రుగుతున్న నిర్మాణ ప‌నులు

ఈ విష‌యమై అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేష‌న్ స‌భ్యులు చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ఉప‌క‌మీష‌న‌ర్ కు ఫిర్యాదు చేయ‌గా, అధికారులు స్పందించి స‌మ‌స్య‌ను ప‌రిశీలించేందుకు వ‌చ్చిన‌ప్ప‌టికీ స‌రైన కార‌ణాలు తెలియ‌రాలేద‌న్నారు. కాగా 28వ తేదీన మ‌రోసారి ఉద‌యం 11గం.ల నుండి 12 గం.ల స‌మ‌యంలో రెండు బ్లాకులు మూడు సెక‌న్ల పాటు కంపించాయ‌ని, దీంతో విష‌యాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన‌ట్లు తెలిపారు. ప‌న్నెండు అంత‌స్థుల భ‌వ‌నాలు పేక‌మేడల్లా కూలిపోతాయేమోన‌ని అపార్ట్‌మెంట్ వాసులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నార‌ని, ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు చొర‌వ చూపి త‌మ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని అసోసియేష‌న్ సభ్యులు కోరుతున్నారు.

Advertisement

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here