నమస్తే శేరిలింగంపల్లి : అన్నమయ్యపురంలో నాద బ్రహ్మోత్సవ వేడుకలో విజయదశమి సందర్భంగా గత పది రోజులుగా విజయోత్సవంగా జరిగింది. ఇందులో భాగంగా వేదాంతం రాధేశ్యామ్ కి నాట్యవిద్యుల్లత అనే బిరుదును జ్వాలా నరసింహారావు వనం అందించారు, పద్మశ్రీ శోభా రాజు, నందకుమార్, పి. పి. రాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో తొలుత శోభా రాజు విద్యార్థులు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్, శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమ్, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము, శ్రీ అన్నమాచార్య అష్టోత్తర శత నామావళి, గురుస్తుతితో ప్రారంభించారు. తొమ్మిదవ రోజు వేదాంతం రాధేశ్యామ్ నృత్య కైంకర్యం చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖులు జ్వాలా నరసింహారావు వనం ముఖ్య అతిథిగా విచ్చేశారు. శ్రీ వేదాంతం సిద్ధేంద్రవరప్రసాద్, సత్య నందిని, రమ్య సాహితి సంయుక్తంగా భామా కలాపం, శివాష్టకం, ముద్దుగారే యశోద, జయ జయ వైష్ణవి దుర్గాంబా, గోదా కలాపం అనే కీర్తనలకు నృత్య ప్రదర్శన నిర్వహించారు. పద్మశ్రీ శోభా రాజు దాదాపు కొన్ని వేలమందికి చిన్న-పెద్ద, కులమత భేదం లేకుండా (మూడు ఏండ్ల నుండి ఎనబై ఏండ్ల వరకు) సంగీతాన్ని నేర్పించారు.
అందులోని ఐదేళ్ల చిరు తారాజువ్వ చి. ధన్యోస్మి, అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులు వాసంతి, జయశ్రీ సంయుక్తంగా, “వేడుకొందామా, ఇంత చక్కని పెండ్లి కొడుకు” అనే సంకీర్తనలకు స్వరార్చన చేశారు. ఈ కార్యక్రమానికి కీ బోర్డుపై రాజు, తబలాపై నోవా వాద్య సహకారం అందించారు. కాగా ఈరోజు ప్రముఖ సినీ నటి రోజా రమణి, అత్తలూరి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఏబివి సంస్థ వ్యవస్థాపకురాలు శోభా రాజు, సంస్థ అధ్యక్షులు నందకుమార్ ప్రదర్శితులకు సంస్థ ఙ్ఞాపికనిచ్చి బహుకరించారు.