ప్రభుత్వానికి, అధికారులకు చెరువుల పరిరక్షణపై చిత్తశుద్ధి లేదు: జనంకోసం

శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): భాగ్యనగరంలో ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వానికి గానీ, ప్రభుత్వ అధికారులకు గానీ ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని జనంకోసం సంస్థ అధ్యక్షులు కసిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. చెరువుల ఆక్రమణలపై నమోదైన కేసుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అయన మీడియా తో మాట్లాడారు. హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న చెరువుల ఆక్రమణలకు సంబంధించిన కేసుల విచారణ లోకాయుక్తలో చివరిదశకు వచ్చిందని, లేక్ ప్రొటెక్షన్ కమిటీ అధికారులు పూర్తిస్థాయిలో హాజరుకావాలని 3 నెలల క్రితం లోకాయుక్త ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్య ధోరణి తో వ్యవహరిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి గానీ అధికారులకు గాని నగరంలోని చెరువులను కుంటలను కాపాడే చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అధికారులు చెరువుల చుట్టువేసే కంచెలను సైతం తొలగించి ఆక్రమణదారులు శిఖం భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. జల వనరులను కాపాడాల్సిన అధికారులే ఆక్రమణదారుల సహకరిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారని లోకాయుక్త స్వయంగా ప్రకటించడం తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. దుర్గం చెరువు పై అద్భుతమైన బ్రిడ్జి నిర్మాణం చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం 2008లో అదే చెరువు పై లోకాయుక్త ఉన్న కేసుకు సంబంధించిన నివేదికను అందించకపోవడం చెరువుల రక్షణపై ప్రభుత్వానికి గల చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. హైకోర్టు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ని ఏర్పాటు చేసినప్పటికీ కమిటీ సభ్యులు తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి ఆక్రమణదారుల కు వత్తాసు పలకడం వల్లనే ఈరోజు నగరానికి ఈ దుస్థితి దాపురించిందని అన్నారు. తాము జనం కోసం సంస్థ ద్వారా 25 కేసులను లోకాయుక్తలో నమోదు చేశామని, విచారణ పూర్తయి చెరువుల ఆక్రమణలు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం కళ్లు తెరచి జల వనరుల అభివృద్ధికి పాటు పడాలని డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here