– సైబర్ టవర్ సాక్షిగా…
– ఒకే స్థలానికి రెండు వేర్వేరు అనుమతులు
– రెండు అంతస్థులకే పర్మిషన్… ఐదు అంతస్థుల నిర్మాణం
– రెసిడెన్షియల్ అనుమతులతో కమర్షియల్ భవనం
– అక్రమ నిర్మాణానికి టౌన్‌ప్లానింగ్ అధికారుల అండ
మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప‌్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేసినా అధికారులు అందుకు తగ్గట్టుగా వ్యవహరించకపోతే సర్కారుకు చెడ్డ పేరుతో సహా ప్రభుత్వ ఖజానాకు భారీ గండి తప్పదు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో వెలసిన అక్రమ నిర్మాణాలు ఎంతటి వారివైనా కూల్చి వేయాల్సిందే అంటూ మంత్రి కేటీఆర్ ఇటీవల హుకూం జారీ చేసిన విషయం తెలిసిందే. కూల్చివేతల కోసమే ఏకంగా రూ.10 లక్షలకు పైగా వెచ్చించి అధునాతన యంత్రాలను ఉపయోగించారు టౌన్‌ప్లానింగ్ అధికారులు. మంత్రి ఆదేశాలతో ఒకవైపు కూల్చివేతలు కొనసాగిస్తూనే మరోవైపు సైబర్‌టవర్స్ ఎదురుగా ప్రధాన రహదారిపై ఓ భారీ అక్రమ నిర్మాణానికి పురుడుపోశారు టౌన్‌ప్లానింగ్ అధికారులు.
హైటెక్ సిటీ సర్కిల్ వద్ద ప్లాట్ నెంబర్ 14లో 360 గజాల స్థలం ఉంది. సదరు ఒకే స్థలానికి రెండు వేర్వేరు పర్మీషన్లు (2/C20/10948/2019 & 2/C20/12327/2019) తీసుకున్నాడు నిర్మాణదారుడు. అంతేకాదు.. ఆ ప్రాంతంలో కమర్షియల్ అనుమతులకు అవకాశం ఉన్నప్పటికి రెండేసి అంతస్థుల చొప్పున రెసిడెన్షియల్ అనుమతులు తీసుకున్నాడు. ఐతే నిర్మాణం తీరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కమర్షియల్ హంగులతో ఏకంగా ఐదు అంతస్థులు నిర్మిస్తున్నాడు. అనుమతులకు, వాస్తవానికి పొంతన లేకుండా కనిపిస్తున్న ఈ నిర్మాణం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎంత భారీ గంఢి పడుతుందో పరిశీలిద్ధాం.
జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం మాదాపూర్‌లోని సదరు 360 గజాల స్థలంలో 4 అంతస్థులకు కమర్షియల్ అనుమతి లభిస్తుంది. ఐతే అందుకోసం భవనంలోని 120 చ.మి(1291చ.అ) స్థలాన్నిఅంటే దాదాపు రూ. 8 నుంచి 10 కోట్ల విలువైన స్థలాన్నిముందస్తుగా జీహెచ్ఎంసీకి మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. కమర్షియల్ నిర్మాణం కోసం రూ.8,65,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఐదవ అంతస్థు నిర్మాణం చేయాలంటే టీడీఆర్‌లను ఉపయోగించుకోవచ్చు. ఆ ప్రాంతంలో మార్కెట్ వాల్యు గజం రూ.15 వేలు. దానికి నాలుగింతలు ధర పలుకుతుంది అక్కడ టీడీఆర్. అంటే గజం టీడీఆర్ ధర రూ. 60 వేలు. సదరు నిర్మాణానికి మినిమమ్ 50 గజాలకు సరిపడ టీడీఆర్ అవసరం. అంటే రూ.3 కోట్లు విలువ. నిబంధనల ప్రకారం 40 శాతం మినహాయించినా ఐదవ అంతస్థు నిర్మాణం కోసం రూ.1.80 కోట్లు వెచ్చించాల్సిందే. వీటన్నింటికి తోడు భూ సామర్థ్య పరీక్షలు, స్ట్రక్చరల్ డిజైన్స్, స్టెబిలిటీ సర్టిఫికేట్, ఫైర్ సేఫ్టీ మేజర్‌మెంట్స్ ఇలా అనేక నిబంధనలు తప్పని సరిగా పాటించాల్సి వస్తుంది.
ఇక్కడ నిర్మాణ దారుడు పై అంశాలన్నింటిని తుంగలో తొక్కి రూ. 2.34 లక్షలు మాత్రమే ఫీజు రూపంలో చెల్లించి సునాయసంగా భవన నిర్మాణం చేపడుతున్నాడు. ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన పెద్ద మొత్తానికి గండి కొడుతూ స్థానిక టౌన్‌ప్లానింగ్ అధికారికి లక్షల రూపాయలు ముట్ట చెప్పినట్టు వినికిడి. ఐతే ఈ భవనం ఒక సాంపుల్ మాత్రమే. శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిళ్లలో ఇలాంటి పదుల సంఖ్యలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. త్వరలో వాటన్నింటిని నమస్తే శేరిలింగంపల్లి ద్వారా పాఠకుల ముందుంచుతాం.
Updates bagunnayi brother…
Tq bro
యదా రాజా తదా ప్రజా
Super bro 👌👌
Tq bro