హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): ఆపదలో ఉన్న పేదలకు సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని గంగారంకు చెందిన కంది ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి అనారోగ్య సమస్యల నిమిత్తం వైద్యం చేయించుకునేందుకు అయ్యే హాస్పిటల్ ఖర్చులకు గాను సహాయం అందించే దాతల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ సహాయం అందజేశారు. ప్రేమ్ కుమార్ వైద్యానికి అయ్యే ఖర్చుల నిమిత్తం రూ.14వేలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా కొండా విజయ్ కుమార్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్ చేస్తున్న సామాజిక సేవ అభినందనీయమని అన్నారు. పేదల కోసం సహాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సునీత రెడ్డి, తెరాస నాయకులు మిరియాల రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.