చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): వైద్య పరీక్షల నిమిత్తం బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరిన ఓ యువతి అదృశ్యమైంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని శివాజీనగర్ హనుమాన్ దేవాలయం వద్ద నివాసం ఉండే కేతావత్ పద్మ తన సోదరి కేతావత్ శ్రీదేవితో కలిసి గచ్చిబౌలి టీసీఎస్ కంపెనీలో హౌజ్ కీపింగ్ విభాగంలో పనిచేస్తోంది. కాగా ఈ నెల 6వ తేదీన ఉదయం 9 గంటలకు శ్రీదేవి అనారోగ్యం కారణంగా వైద్య పరీక్షలు చేయించుకుంటానని చెప్పి నవాబ్ పేట హాస్పిటల్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పింది. అనంతరం ఆమె అదే రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో తాను శంకర్‌పల్లి వద్ద ఉన్నానని చెప్పింది. తరువాత ఆమె ఫోన్ స్విచాఫ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోసం అన్ని చోట్లా గాలించినా ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో వారు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.