గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): కోవిడ్ బాధితులను రక్షించేందుకు ప్లాస్మా దాతలు ముందుకు రావాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్మా మాత్రమే ఎకైక మార్గమని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. మంగళవారం ప్లాస్మా దానంపై అవగాహన పెంచేందుకు రూపొందించిన వీడియో సాంగ్ ను ఎంపీ సంతోష్ కుమార్ సైబరాబాద్ కమీషనర్ విసి సజ్జనార్, ఎమ్మెల్సీ నవీన్ రావు లతో కలిసి కమిషనరేట్ లో ఆవిష్కరించారు. అనంతరం గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కమిషనరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సంధర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్లాస్మా దానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కొరారు. కోవిడ్ విలయ సమయంలో పోలీసు సిబ్బంది అందించిన సేవలు వెలకట్టలేనివని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలందించిన ప్రతీ పోలీసు కు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. దేశ పోలీసు వ్యవస్థలో తెలంగాణ పోలీసులు సేవలో నెంబర్ వన్ గా నిలుస్తున్నారని తెలిపారు. అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ నేటి వరకు ప్లాస్మా దానంలో 2700 మంది భాగస్వాములు అయ్యారని, దాదాపు 4500 మంది కోవిడ్ బాధితులను ప్రమాదం నుండి కాపాడగలిగారని తెలిపారు. గతంలో తాము నిర్వహించిన రక్తదాన శిబిరంలో 5500 యూనిట్లను సేకరించి నగరంలోని బ్లడ్ బ్యాంకులకు అందజేసినట్లు తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ను దేశ వ్యాప్తంగా అనుసరిస్తున్నారని అన్నారు. ఇతరులకు బహుమతులు అందించడానికి బదులు మొక్కలను బహుమతి గా అందించాలని సూచించారు. మొక్కలు నాటే ప్రక్రియ నిరంతరం జరగాలన్నారు. వీడియోసాంగ్ నిర్మాణంలో పాలు పంచుకున్న కళాకారులందరికీ ఎంపీ సంతోష్ కుమార్, విసి సజ్జనార్ లు అభినందనలు తెలిపారు. ఈ పాటను ప్రముఖ దివంగత గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు అంకిటమిస్తున్నట్లు ప్రకటించారు. కోవిడ్ నుండి కోలుకుని ప్లాస్మా దానం చేసిన ప్లాస్మా యోధులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, డిసిపి అనసూయ, మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు, ఎస్ సిఎస్ సి ప్రధాన కార్యదర్శి కృష్ణ ఎదుల, సినీ దర్శకులు వివి వినాయక్, మెడికోవర్ హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ శరత్ రెడ్డి, సినీ నిర్మాత సి.కళ్యాణ్, వీడియో సాంగ్ టీం గౌతమ్, కళ్యాణ్ చక్రవర్తి, శ్రీరామ చంద్ర, సాకేత్ తదితరులు పాల్గొన్నారు.