నమస్తే శేరిలింగంపల్లి: హిందువుల మనోభావాలు కించపరుస్తూ అయోధ్య రామాలయం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు శాసన సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని బిజెపి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం హయత్ నగర్ డివిజన్ బిజెపి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు విద్యాసాగర్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చింతకింది గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ అయోధ్య లో నిర్మిస్తున్న రామమందిరం సమస్త హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు.
మందిర నిర్మాణానికి విరాళాలు వసూలు చేయాల్సిన అవసరం కూడా లేదని, దేశంలో ఎంతోమంది కుబేరులు స్వచ్చందంగా కోట్లాది రూపాయలతో తామే నిర్మిస్తామని ముందుకు వచ్చినప్పటికీ ఈ బృహత్ కార్యంలో పలు పంచుకునే అదృష్టాన్ని దేశ ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో దేశ వ్యాప్త విరాళాలు సేకరిస్తున్నారని అన్నారు. కేవలం హిందువులే కాకా అన్య మతస్తులు సైతం రామ మందిర నిర్మాణంలో భాగమయ్యేందుకు ఎదురు చూస్తున్నారని అన్నారు. బిజెపి నాయకులు రామ మందిర నిర్మాణాన్ని ఎన్నికల అస్త్రంగా వాడుకుంటారని విమర్శించిన టిఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు మందిరం నిర్మాణం జరుగుతుంటే ఓర్వలేక ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో మెజారిటీ ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వకుండా నోటికొచ్చినట్లు మాట్లాడిన విద్యాసాగర్ రావు శాసన సభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఎల్లప్ప, ప్రధానకార్యదర్శి అశోక్, సీనియర్ నాయకుడు బండారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.