-
మియాపూర్ లో అదృశ్యం.. కొల్లూరులో మృతదేహం లభ్యం
-
24 గంటలలో కేసును ఛేదించిన పోలీసులు
మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): ఇంటి నుండి బయటకు వెళ్లి కనిపించకుండా పోయిన ఓ మహిళ హత్యాచారనికి గురైంది. సదరు మహిళను బలవంతంగా ఎత్తుకెళ్లిన ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడగా తలకు తీవ్ర గాయలవ్వడంతో ఆమె ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచింది. మియాపూర్ పోలీస్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ కృష్ణ ప్రసాద్ లు మీడియా సమావేశంలో వెల్లడించారు.

రామచంద్రపురం మండలం పరిధిలోని కొల్లూరు గ్రామంలో గల భోజ్య తండాకు చెందిన వాడిత్య మధు నాయక్(24) సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. కొల్లూరు గ్రామానికి చెందిన ప్రయివేటు ఉద్యోగి తాళ్ళూరి కుటుంబరెడ్డి(28), అదే ప్రాంతానికి చెందిన సిందం ఆనందం(27) లు స్నేహితులు. ఐతే 3వ తేదీన మధు, కుటుంబరెడ్డిలు నగరంలోని ఓ సమావేశానికి హాజరై తిరిగి వచ్చే సమయంలో సిందం ఆనందంతో కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలోనే ఆనందం ఎవరైనా తెలిసిన మహిళను సమకూర్చమని మధు నాయక్ ను అడగగా న్యూ కాలనీలో ఉండే బోజ్యా తండాకు చెందిన మహిళ(30) ఫోన్ లో సంప్రదించి మాట్లాడాలని నమ్మబలికి ఆమె ఇంటికి వెళ్లారు. సదరు మహిళ వారి వెంట వెళ్ళడానికి తిరస్కరించడంతో ముగ్గురూ కలిసి ఆమెను బలవంతంగా కుటుంబరెడ్డి కారులో ఎక్కించి కొల్లూరు లోని వ్యవసాయ పొలాల్లో షెడ్డులోకి తీసుకుని వెళ్లి బలవంతంగా ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో బాధితురాలి తలకు తీవ్ర గాయాలు అవ్వడంతో ఘటన స్థలంలోనే మృతి చెందింది. మృతదేహాన్ని అక్కడే వదిలిన ముగ్గురు నిందితులు పరారయ్యారు. అయితే అప్పటికే బాధితురాలి తల్లి 4 వ తేదీన మియాపూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా పోలీసులు నమోదు చేశారు. కాగా నిందితులు ముగ్గురు బాధితురాలిని ఆ ప్రాంతానికి తీసుకువచ్చినట్లు వాడిత్య మధునాయక్ తనకు చెప్పాడని భోజ్య తండాకు చెందిన కౌన్సిలర్ వాడిత్య రాంసింగ్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న బాధితురాలి బంధువులు, పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుల కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు గురువారం ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.





