హైదరాబాద్‌లో ప్రజా సమస్యలపై ఎంసిపిఐ(యు) పోరాటం

శేరిలింగంప‌ల్లి, జూలై 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి విమర్శించారు. మియాపూర్‌లోని ముజాఫర్ అహ్మద్ నగర్‌లో శుక్రవారం జరిగిన ఎంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ స్థాయి పార్టీ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హైటెక్ నగరంగా పేరొందిన హైదరాబాద్‌లోనే మధ్యతరగతి కాలనీలు, పేదల మురికివాడల్లో మౌలిక సదుపాయాల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆయన అన్నారు. వర్షాకాలంలో నగరం జలమయం కావడం, ట్రాఫిక్ సమస్యలు, ఇంటి పట్టాలు, ఇంటి నెంబర్లు, ఇళ్ల స్థలాల సమస్యలు, మౌలిక వసతుల కొరత వంటి అంశాలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ప్రజలు నిలదీసే ఉద్యమాలు లేకపోవడం వల్లే సమస్యలు పరిష్కారం కావడం లేదని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు ఇతర ప్రజా సంక్షేమ పథకాల అమలు కోసం, స్థానిక సమస్యలు, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై ఎంసిపిఐ(యు) భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఈ పోరాటాల్లో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంసిపిఐ(యు) పొలిట్ బ్యూరో సభ్యుడు ఎన్. చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశ సమైక్యత, సమగ్రతకు బీజేపీ పాలన విఘాతంగా మారిందని విమర్శించారు. ప్రజల సంపదను కొద్దిమంది కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మళ్లిస్తున్నారని, భారీ అప్పులతో పేదరికాన్ని పెంచుతున్నారని ఆరోపించారు. మతోన్మాద, మనువాద విధానాలతో ప్రజల ఆలోచనలను ప్రభావితం చేస్తున్నారని విమర్శిస్తూ, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎంసిపిఐ(యు) తగిన కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.

సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యుడు పల్లె మురళి అధ్యక్షత వహించగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్, కుంభం సుకన్య, వి. తుకారాం నాయక్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్, సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here