శేరిలింగంపల్లి, ఆగస్టు 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై సమీక్ష సమావేశం శనివారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో AEROలు, సూపర్వైజర్లు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ERO నారాయణ్ అమిత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SIR కార్యక్రమ గడువును ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులకు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు.

ప్రస్తుతం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 56 శాతం లక్ష్యం పూర్తయిందని, ఇంకా 44 శాతం పనులు మిగిలి ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మిగిలిన లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది కార్యాచరణను మరింత వేగవంతం చేయాలని నారాయణ్ అమిత్ ఆదేశించారు. ప్రతి ఇంటిని సందర్శించి వివరాలు సేకరించడం, పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించడం, డేటా ఎంట్రీలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోజువారీ లక్ష్యాలను సమీక్షిస్తూ 100 శాతం పూర్తి దిశగా పని చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం డిజిటల్ డాష్బోర్డ్ ద్వారా జోన్వారీగా SIR పురోగతిని సమీక్షించారు. ఆగస్టు 10 నాటికి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో SIR కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు, అన్ని వార్డుల AEROలు, సూపర్వైజర్లు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.





