అంబీర్ చెరువులో STP నిర్మాణంపై ఆగ్రహం.. వెంటనే నిలిపివేయాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 1 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీకి ఆనుకుని ఉన్న అంబీర్ చెరువులో ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలో నిర్మిస్తున్న ఎస్టీపీ (STP) ప్లాంట్‌ను తక్షణమే నిలిపివేయాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాలనీవాసులకు అండగా నిలిచి సమస్య పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆదిత్య నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కంటెస్టెంట్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ అంబీర్ చెరువులో ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో ఎస్టీపీ నిర్మాణం వల్ల భవిష్యత్తులో ఆరోగ్య, పర్యావరణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో కోర్టును కూడా ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సుందరీకరణ పేరుతో గతంలో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అంబీర్ చెరువును ఆక్రమణల ద్వారా 150 ఎకరాలకు కుదించారని ఆరోపించారు. గత, ప్రస్తుత పాలకపక్ష నాయకులు కలిసి చెరువు ఆక్రమణలకు పాల్పడ్డారని విమర్శించారు.

కంచె చేను మేసినట్లు ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోకుండా చట్టవిరుద్ధంగా ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో ఎస్టీపీ నిర్మిస్తున్నార‌ని, కాలనీవాసుల పోరాటం న్యాయబద్ధమైనద‌ని, ఈ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు అన్ని స్థాయిల్లో పోరాడతామ‌ని స్ప‌ష్టం చేశారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తానని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ కాలనీవాసుల సమస్యను తమ సమస్యగా భావించి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, భరత్ కుమార్‌తోపాటు బీజేపీ నాయకులు రవీందర్ రావు, సీతారామరాజు, కృష్ణంరాజు, కేశవులు, అరుణ్ కుమార్, దుర్గాప్రసాద్, నర్సింగ్ రావు, నర్సింగ్ యాదవ్, వెంకటస్వామి రెడ్డి, రాయల్, ఎస్‌కే చాంద్, సైదమ్మ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here