మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడిని నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం దీప్తిశ్రీ నగర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా లో ఒక 19 ఏళ్ల మహిళపై నలుగురు అతి క్రూరంగా అత్యాచారం చేసి అనంతరం ఆమె నాలుకను కొయ్యడం అంటే సాక్ష్యం చెప్పకుండా చేశారని ఆయన ఆరోపించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలోని యోగి ప్రభుత్వం ఏం చేస్తుందని, యువతి మృతదేహాన్ని దహనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దేశంలో దళితులకు మైనారిటీలకు ఇతర వర్గాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని వారు తీవ్రంగా విమర్శించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకీ ఆటవిక రాజ్యం గా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాదులో సైతం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుందని వాటిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా, యువజన సమాఖ్య నాయకులు లక్ష్మి, లావణ్య, మధు, కన్నా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.