చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం సాధ్యపడుతుందని పిఆర్‌కె వైద్య బృందం మరోసారి రుజువు చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం చందానగర్ లోని పిఆర్‌కె హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్డియాక్ సెంటర్ ను తలసాని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య బృందం నూతన వైద్యపరికరాలతో శ్రీనివాస్ యాదవ్ కు వైద్యపరీక్షలు నిర్వహించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ వైద్య రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నకొద్దీ అనేక రోగాలను సులువుగా నయం చేసేందుకు వీలు పడుతుందన్నారు. ఈ క్రమంలోనే పిఆర్‌కె యాజమాన్యం వైద్య విధానంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. అనంతరం హాస్పటల్ ఎండి రవికుమార్, చీఫ్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ లు మాట్లాడుతూ ఫిలిప్స్ అజూరియన్ సిస్టం అనే కొత్త సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కార్డియాక్ వైద్య పరికరాలను తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో తమ ఆసుపత్రిలోనే ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇతర హృదయ వైద్య పరికరాలతో పోల్చితే తక్కువ సమయంలో, అతి తక్కువ రేడియేషన్ తో అత్యుత్తమ ఫలితాలను పొందడం ఈ సిస్టం ద్వారా సాధ్యపడుతుందని తెలిపారు. నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.