ఓ వ్యక్తి ఆన్లైన్ లో cow dung cakes(ఆవు పేడతో చేసిన పిడకలు) ని తినే వస్తువుగా భావించి ఆర్డర్ చేశాడు. ఆర్డర్ వచ్చాక తిని చూశాడు. తిన్నాక కూడా అవి పిడకలు అని అర్థం కాలేదేమో మరి తాను ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ పై మీరు తయారు చేసిన కేకు రుచిగా లేదంటూ రివ్యూ రాసేశాడు. ఈ విచిత్రమైన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తాజాగా సామాజిక మాద్యమలలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది. అందులో ఓ వ్యక్తి అమెజాన్ వెబ్ సైట్ లో ఆవు పిడకలకు (cow dung cake) సంబంధించిన పోస్టు పై తన రివ్యూ ఇలా రాశాడు. “ ఈ కేకులు రుచి అస్సలు బాగు లేవు. గడ్డి, బురద తిన్నట్లుగా అనిపించింది. ఆ తరువాత నాకు నీళ్ల విరేచనాలు అయ్యాయి. మీరు కొంచెం పరిశుభ్రత విషయంలో జాగ్రత్త వహించండి. కేకులను కొంచెం రుచిగా, కరకరలాడేలా తయారు చేయండి.” అంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఈ రివ్యూ తమకు ఎంతో ఉపయుక్తంగా ఉందంటూ 1100 పైగా వినియోగదారులు లైక్ చేయడం కొసమెరుపు.
లాజికల్ గా ఆలోచిస్తే ఆన్లైన్ షాపింగ్ చేసే వారిలో చాలామందికి cow dung cakes అంటే ఆవు పిడకలు అని తెలిసే ఉంటుంది. తెలియకుండా ఆర్డర్ చేసి రుచి చూసినా ఎవ్వరికైనా అవి ఆవు పిడకలు అని ఎలాగో తెలిసిపోతుంది. అంటే ఈ రివ్యూ సరదా కోసమో, వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో రాసినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ ఎంతో ఫన్నీగా ఉండటంతో నెటిజన్లు ఈ రివ్యూ ఫోటోలను తెగ వైరల్ చేసేస్తున్నారు.