నమస్తే శేరిలింగంపల్లి : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శ్రీనగర్ కాలనీలోని నివాసంలో సోమవారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తో కలిసి జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, యెగ్గే మల్లేశం, దయనంద్ గుప్తా, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్వర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, యువ నేత కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారంతా ముక్తకంఠంతో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుందని, ఈ సారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇస్తామన్నారు.