ప్రొఫెసర్ వెంకటేశ్వరరావుపై ఆరోపణలపై నిష్పక్షపాత విచారణకు డిమాండ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జేఎన్టీయూ హైదరాబాద్ మాజీ రిజిస్ట్రార్, ప్రముఖ నానోటెక్నాలజీ పరిశోధకుడు ప్రొఫెసర్ కె. వెంకటేశ్వరరావుపై వస్తున్న ఆరోపణలు విద్యావర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పలువురు విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. దశాబ్దాలుగా విద్యా, పరిశోధనా రంగాల్లో విశేష సేవలందించిన ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు వందలాది పరిశోధనా పత్రాలను ప్రచురించడంతో పాటు అనేక మంది విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారని వారు గుర్తుచేస్తున్నారు. పేదలకు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించిన వ్యక్తిగా కూడా ఆయనకు గుర్తింపు ఉందని పలువురు పేర్కొంటున్నారు.

ఒక విద్యావేత్తపై ఆరోపణలు వచ్చినప్పుడు వాటి వెనుక ఉన్న వాస్తవాలను నిష్పక్షపాతంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత కక్షలు లేదా రాజకీయ ఒత్తిళ్లకు విద్యావ్యవస్థ వేదిక కాకూడదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులారా.. మీ రాజకీయాలు మీకు ఉండవచ్చు.. మా పిల్లల భవిష్యత్తుతో మాత్రం ఆడుకోవద్దు అంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరోపణలు నిజమని విచారణలో తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో నిరూపితం కాని ఆరోపణలతో ఒక విద్యావేత్త గౌరవప్రతిష్ఠలకు భంగం కలిగించవద్దని కోరుతున్నారు. జేఎన్టీయూ ప్రతిష్ఠను కాపాడాలని, విద్యావేత్తల గౌరవాన్ని నిలబెట్టాలని, విద్యాసంస్థలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని విద్యావర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఆరోప‌ణ‌ల‌పై పారదర్శకమైన విచారణే వాస్తవాలను వెల్లడించి న్యాయం జరిగేలా చేస్తుందని వారు పేర్కొంటున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here