మియాపూర్‌లో ఆశ్రయ వృద్ధాశ్రమ నూతన భవనం ప్రారంభం.. రూ.లక్ష విరాళం అందించిన హరీష్ రావు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ మయూరినగర్‌లో హైదరాబాద్ జిల్లా ఆశ్రయ వృద్ధాశ్రమ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు వృద్ధాశ్రమ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమ నిర్వహణకు తన వంతు సహాయంగా రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. విద్య ఒక్కటే జీవితంలో ముఖ్యమైనది కాదని, విద్యతో పాటు సంస్కారం, మానవత్వం, తల్లిదండ్రుల పట్ల గౌరవం కూడా ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు. తమను కని, పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను ఆదరించలేని పిల్లలు మానవత్వపు విలువలను కోల్పోతున్నారని పేర్కొన్నారు.

అదేవిధంగా చిన్నారులను వదిలేసే తల్లిదండ్రుల తీరుపై కూడా స్పందిస్తూ.. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత ఎంతో అవసరమని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకు రావాలని, మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులు, అనాథ చిన్నారులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారికి చీరలు, దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఆశ్రమ నిర్వహణకు రూ.1 ల‌క్ష విరాళంగా అందజేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తామని హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. వాటి అభివృద్ధికి అవసరమైన ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా ఆశ్రయ వృద్ధాశ్రమ జనరల్ సెక్రటరీ షైనా అఫ్రోజ్ మాట్లాడుతూ.. వృద్ధులు, అనాథ చిన్నారులకు సేవ చేయడమే తమ జీవిత లక్ష్యమని తెలిపారు. తమ వ్యక్తిగత సంపదలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తూ, కుటుంబ ఆదరణకు దూరమైన వృద్ధులకు బిడ్డలుగా, తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన చిన్నారులకు తల్లులుగా అండగా నిలుస్తున్నామని వివరించారు. ఆశ్రమ సభ్యులందరూ బాధ్యతతో, ప్రేమాభిమానాలతో సేవలందిస్తున్నారని చెప్పారు. వృద్ధాశ్రమ నిర్వాహకుల సేవలను హరీష్ రావు ప్రత్యేకంగా అభినందించారు. సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న ఇలాంటి సేవా సంస్థలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ్రయ వృద్ధాశ్రమ అధ్యక్షురాలు వహిదా ఖాటూన్, ఉపాధ్యక్షురాలు మంత్రి కళావతి, జనరల్ సెక్రటరీ షైనా అఫ్రోజ్, జాయింట్ సెక్రటరీ సరళ, కోశాధికారి పోచమ్మ, సభ్యులు జరీనా బేగం, యాదమ్మ, సంధ్యారాణి, భాగ్యమ్మ పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ రంగారావు, కంటెస్టెడ్ కార్పొరేటర్ ఆకుల శ్రీనివాస్, ఫజల్ భాయ్, సాయిలు, సాయితేజ రావు హాజరయ్యారు. బీఆర్ఎస్ డివిజన్ నాయకులు కోమట్ల శ్రీనివాస్ రెడ్డి, పురుషోత్తం యాదవ్, గోపరాజు శ్రీనివాస్ రావు, కిరణ్ యాదవ్, నవత రెడ్డి, గంగాధర్, పరునంది శ్రీకాంత్, తిరుపతి, శివరాజ్ స్వామినాయక్, భిక్షపతి, శ్రీనివాస్, మెడిప్లెస్ రవి, రాజు తదితర బీఆర్ఎస్ నాయకులు, సేవా సంస్థల ప్రతినిధులు, దాతలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here