శేరిలింగంపల్లి, నవంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు నేరాల నియంత్రణే లక్ష్యంగా చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 150 సీసీ కెమెరాలను ప్రారంభించారు. స్థానికులు, కాలనీ సంక్షేమ సంఘాలు, వ్యాపారస్తులు, దాతలు, పోలీస్ శాఖ సమిష్టి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సుమారు 300 మంది హాజరై తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి డీసీపీ Ch. శ్రీనివాస్, ఏసీపీ Ch. Y. శ్రీనివాస్ కుమార్, సీఐ శ్రీధర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది అందించిన సహకారానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించిన ఎనిమిది మంది దాతలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. మిర్యాల రాఘవరావు , వెర్టెక్స్ కన్స్ట్రక్షన్స్, రాగం నాగేందర్ యాదవ్, రమణమూర్తి, గోపాల్, రఘుపతి రెడ్డి, రాధాకృష్ణ , ప్రేమ్ కుమార్ మొత్తం కలిపి రూ.18 లక్షల విరాళాలను అందజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, సిబ్బంది సహా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ సీసీ కెమెరాల ఏర్పాటు స్థానిక ప్రాంతాల్లో భద్రతను మెరుగుపరచడానికి, నేరాల నియంత్రణకు దోహదపడనుంది.





