శేరిలింగంపల్లి, నవంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న స్విగ్గీ డెలివరీ బాయ్‌ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి మొత్తం 1,089 గ్రాముల గంజాయితో పాటు ఎలక్ట్రానిక్ తూకం యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన బలరాం మొహంతా (28) మాదాపూర్‌లోని సిద్దిక్‌నగర్‌లో నివాసం ఉంటూ స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అదనపు ఆదాయం సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశాకు చెందిన బాబు అనే వ్యక్తి వద్ద కిలో గంజాయిని రూ.15 వేలుకు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. అనంతరం గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి ఒక్కో ప్యాకెట్‌ను రూ.400 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
గంజాయి విక్రయాలపై విశ్వసనీయ సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు, డివిజన్ క్లోజ్ టీమ్ సిబ్బందితో కలిసి సిద్దిక్‌నగర్‌లోని రోడ్ నంబర్ 4లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన బలరాం మొహంతాను అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి వద్ద, అతని నివాస గదిలో తనిఖీలు నిర్వహించి మొత్తం 1,089 గ్రాముల గంజాయితో పాటు ఎలక్ట్రానిక్ తూకం యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గంజాయి సరఫరా చేసిన ఒడిశాకు చెందిన బాబు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.





