ఎల్లమ్మబండ 100 ఫీట్ల రోడ్డు విస్తరణ వేగవంతం చేయాలి: ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూన్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఉషముళ్లపూడి కమాన్ నుంచి గాజులరామారం వరకు, ఎల్లమ్మబండ మీదుగా చేపడుతున్న 100 ఫీట్ల ప్రధాన రహదారి విస్తరణ పనులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కూడా పాల్గొన్నారు. గాంధీ మాట్లాడుతూ, ఉషముళ్లపూడి కమాన్ నుంచి గాజులరామారం వరకు ఎల్లమ్మబండ రహదారిపై రోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంటోందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా 100 ఫీట్ల రోడ్డు విస్తరణ చేపట్టినట్లు చెప్పారు. గతంలో అధికారులతో కలిసి ఉషముళ్లపూడి కమాన్ నుంచి సిక్కుల బస్తీ వరకు పాదయాత్ర నిర్వహించి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న అంశాలను తొలగిస్తూ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

రోడ్డు మధ్యలో ఉన్న బండరాళ్ల తొలగింపు, అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, విద్యుత్ స్థంబాల స్థానభ్రంశం వంటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రోడ్డు విస్తరణ సమయంలో దెబ్బతిన్న మంచినీటి పైప్‌లైన్‌ను వెంటనే పునరుద్ధరించినట్లు వెల్లడించారు. రోడ్డు విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, నాణ్యత ప్రమాణాల్లో ఎలాంటి రాజీ లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఎల్లమ్మబండ రహదారిపై డివైడర్ సుందరీకరణ పనులు కూడా చేపట్టాలని, విస్తరణ పూర్తయిన తర్వాత ట్రాఫిక్ సమస్యకు గణనీయమైన ఉపశమనం లభిస్తుందని చెప్పారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే ప్రజలకు సమయం, ఇంధనం ఆదా కావడంతోపాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి కొనసాగుతుందని, ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని గాంధీ స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పన ద్వారా నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here