శేరిలింగంపల్లి, జూలై 30 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) చేపడుతున్న వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమంలో భాగంగా కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, డిప్యూటీ కమిషనర్, వివిధ శాఖల విభాగాధిపతులతో కలిసి అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని భారతి నగర్ వార్డును సందర్శించారు. ఈ సందర్భంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమై వార్డులో నెలకొన్న పౌర సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధులు వార్డులోని పలు పౌర సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన మున్సిపల్ సేవలు అందించేందుకు అవసరమైన చర్యలపై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, భూగర్భ మురుగునీటి (యూజీడీ) పైప్‌లైన్ల మరమ్మత్తులు, నిర్వహణ, నివాస కాలనీల్లో చెట్ల కొమ్మల కత్తిరింపు, చెత్త సేకరణ, పారిశుధ్య సేవల మెరుగుదల, పార్కుల అభివృద్ధి, నిర్వహణ, ఓపెన్ జిమ్‌లు, చిన్నారుల ఆట పరికరాల ఏర్పాటు, కాంపౌండ్ వాల్‌ల నిర్మాణం, స్టార్మ్ వాటర్ డ్రెయిన్‌ల మరమ్మత్తులు, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ, పాఠశాలలు, కార్యాలయాల సమయాల్లో ట్రాఫిక్ నియంత్రణ, వీధి దీపాల నిర్వహణ, డ్రైనేజీ అవుట్‌లెట్ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో ప్రస్తావించిన ప్రతి సమస్యను సంబంధిత శాఖలు పరిశీలించి ప్రాధాన్యతతో పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్‌కు సంబంధించిన అర్హత కలిగిన పనులకు అంచనాలు సిద్ధం చేస్తున్నామని, ఇతర శాఖల పరిధిలోని అంశాలను ఆయా శాఖలకు పంపించి అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని అధికారులు వెల్లడించారు.
ప్రజలు నేరుగా కమిషనర్, ఉన్నతాధికారులతో తమ సమస్యలను పంచుకునే వేదికగా వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమం కొనసాగుతోందని, సంబంధిత శాఖల సమన్వయంతో పౌర సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.





