శేరిలింగంపల్లి, జూలై 30 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రత్యేక విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తూ ప్రజల్లో భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు వివిధ దుకాణాలను సందర్శించి షాపు యజమానులతో గురువారం సమావేశమయ్యారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతోపాటు కమ్యూనిటీ భద్రతలో భాగంగా షాపు ఎడమ, కుడి, ఎదురుగా ఉన్న ప్రాంతాలు స్పష్టంగా కవర్ అయ్యేలా అదనంగా మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వారికి సూచించారు.

అలాగే నేను సైతం కార్యక్రమం కింద ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలను జియో-ట్యాగ్ (Geo-Tag) చేస్తూ, కెమెరాలు లేని దుకాణాల యజమానులకు వాటిని ఏర్పాటు చేయాలని నోటీసులు జారీ చేశారు. ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజూ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని చందానగర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.





