నిర్మాణ కార్మికులకు BOCW నమోదు కార్డులు

శేరిలింగంపల్లి, జూలై 30 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ సహకారంతో భవన నిర్మాణ కార్మికుల నమోదు కార్డుల పంపిణీతోపాటు కార్మిక సంక్షేమ అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఖాజాగూడలోని ఎస్‌ఏఎస్ఐ టవర్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, అదనపు డీసీపీ ఎం. సుదర్శన్, మాదాపూర్ ఏసీపీ శ్రీధర్, శేరిలింగంపల్లి అసిస్టెంట్ లేబర్ అధికారులు వినీల, రేణుకతోపాటు రాయదుర్గం ఎస్‌హెచ్‌వో, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 256 మంది అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ (BOCW) నమోదు కార్డులను పంపిణీ చేశారు. పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలపై కార్మికులకు అవగాహన కల్పించారు. నమోదు చేసుకున్న కార్మికులకు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, బీమా, వివాహ సహాయం, ప్రసూతి సహాయం, ప్రమాద మరణ పరిహారం, సహజ మరణ సహాయం, వైకల్య సహాయం, ఆసుపత్రి చికిత్స సహాయం, అంత్యక్రియల సహాయం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉచిత ఆరోగ్య పరీక్షలు వంటి పలు సంక్షేమ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మాణ సంస్థలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు తమ వద్ద పనిచేస్తున్న కార్మికుల వివరాలతో కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి అర్హత కలిగిన నిర్మాణ కార్మికుడిని తెలంగాణ భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో తప్పనిసరిగా నమోదు చేయించాలని అధికారులు బిల్డర్లు, యాజమాన్యాలకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి కార్మికుడికి అందేలా తమ సంస్థల్లో పనిచేస్తున్న అర్హులందరికీ నమోదు కార్డులు ఇప్పించి పూర్తి సహకారం అందిస్తామని నిర్మాణ సంస్థల ప్రతినిధులు హామీ ఇచ్చారు. నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, ప్రతి అర్హత కలిగిన కార్మికుడు నమోదు చేసుకుని వాటి ప్రయోజనాలను పొందాలని అధికారులు సూచించారు. అలాగే యజమానులు తమ వద్ద పనిచేస్తున్న కార్మికుల సంక్షేమాన్ని సామాజిక బాధ్యతగా భావించి వారి నమోదుకు సహకరించాలని పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here