శేరిలింగంపల్లి, జూన్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంలను బలవంతంగా విక్రయించడం, అధిక ఫీజులు వసూలు చేయడం, ఫీజు ఆలస్యంగా చెల్లించినందుకు పెనాల్టీల పేరుతో తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ఆరోపిస్తూ ఏఐఎఫ్‌డీఎస్ ఆధ్వర్యంలో శనివారం మియాపూర్ హెచ్‌ఎంటీ స్వర్ణపురిలోని ఎంఎన్ఆర్ స్కూల్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఫీజు ఆలస్యంగా కట్టినందుకు లేట్ ఫీజులు, పెనాల్టీల పేరుతో తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న స్కూల్ యాజమాన్యంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు వసూలు చేసిన లేట్ ఫీజులను కూడా తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాలని కోరారు.

ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని, ప్రభుత్వం జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి 26న జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)కి ఫిర్యాదు చేసినట్లు ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి తెలిపారు. ఫిర్యాదుపై స్పందించిన డీఈవో, శేరిలింగంపల్లి మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో)కి విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించారని చెప్పారు. ఎంఈవో పాటు స్కూల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి తమకు కూడా కాపీలు పంపించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి విచారణ జరిగినట్లు ఆధారాలు లేవని ఆరోపించారు. వెంటనే విచారణ చేపట్టి సంబంధిత ఎంఎన్ఆర్ స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, దుర్గాప్రసాద్, జేడీ గణేష్, యువజన కాంగ్రెస్ నాయకుడు మన్నె నరేంద్ర ముదిరాజ్, బీఆర్ఎస్‌వీ శేరిలింగంపల్లి నాయకుడు రాజు యమలవలస, ఎన్‌టీవీఎస్ నాయకులు పవన్, జగదీష్, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.





