శేరిలింగంపల్లి, జూన్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కూకట్‌పల్లి జోన్ పరిధిలో గుర్తించిన పలు గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లను (జీవీపీలు) సామాజిక భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్మూలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పారిశుద్ధ్య సిబ్బంది, రామ్‌కీ సంస్థ ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను పూర్తిగా శుభ్రం చేశారు. అనంతరం ఆ ప్రదేశాలను పూల మొక్కలు, రంగవల్లులతో అలంకరించి పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల నిర్మూలనతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో చెత్త వేయకుండా పరిశుభ్రతను కాపాడేందుకు తమవంతు బాధ్యతగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కూకట్‌పల్లి డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాల నిర్వహణలో పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. రోడ్లపై చెత్త వేయకుండా, పారిశుద్ధ్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని సూచించారు. సమాజం, పారిశుద్ధ్య సిబ్బంది, స్థానిక సంస్థలు కలిసి పనిచేస్తే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నగర నిర్మాణం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.





