వైశాలి నగర్ మ్యాన్‌హోల్ ఘటన.. బాలయ్య కుటుంబానికి ఆరెకపూడి గాంధీ ప‌రామ‌ర్శ‌..

శేరిలింగంపల్లి, జూలై 30 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్ వద్ద ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో గల్లంతైన బాలయ్య (70) కుటుంబ సభ్యులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరామర్శించారు. జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, డిప్యూటీ కమిషనర్లు శ్రీనివాస్, సేవా ఇస్లావత్‌లతో కలిసి బాలయ్య భార్యను, కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, ప్రభుత్వం తరఫున అందాల్సిన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ విషాద ఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.

గల్లంతైన బాలయ్య ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని పోలీసు శాఖ, హైడ్రా, ఎన్‌డీఆర్‌ఎఫ్, సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం, జలమండలి అధికారులకు సూచించినట్లు తెలిపారు. అర్థరాత్రి 2 గంటల వరకు నాలా ఔట్‌లెట్‌లు, చెరువు ఇన్‌లెట్‌లు, ఔట్‌లెట్‌లను స్వయంగా పరిశీలించినట్లు వెల్లడించారు. ప్రతి మ్యాన్‌హోల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని, కెమెరాల సాయంతో కూడా గాలింపు కొనసాగుతోందని తెలిపారు. బాలయ్య ఆచూకీ లభించే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో గాలింపు చర్యలను నిరంతరం కొనసాగిస్తారని చెప్పారు. వర్షాకాల పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఆరెకపూడి గాంధీ సూచించారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో అధికారులు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని ఆదేశించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here