దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే నిత్యం దేశవ్యాప్తంగా 1 లక్ష మందికి టీకాలను ఇస్తున్నారు. తొలి దశలో మొత్తం 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్లకు టీకాలను ఇవ్వనున్నారు. అయితే ప్రధాని మోదీ ఎప్పుడు టీకా తీసుకుంటారు ? అనే విషయంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది.
తొలి విడతలో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్లకు టీకాలను ఇవ్వడం పూర్తయితే రెండో విడతలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, 50 ఏళ్లకు పైబడిన వారికి టీకాలను ఇస్తారు. ఆ దశకు వస్తే రాజకీయ నాయకులకు కూడా టీకాలను తీసుకునేందుకు వీలు కలుగుతుంది. మోదీ ఇది వరకే కేవలం ఫ్రంట్ లైన్ వారియర్లకే టీకాలను ఇవ్వమని చెప్పారు కనుక.. రెండో దశలో రాజకీయ నాయకులు వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వారిలో 50 ఏళ్లకు పైబడిన వారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు చాలా మంది ఉన్నారు కనుక వారికి కూడా రెండో దశ నుంచే టీకా పంపిణీ ప్రారంభమవుతుంది. ఇక అందులో భాగంగానే మోదీ కూడా వ్యాక్సిన్ తీసుకుంటారని తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయింది.