ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం.. ప్రభుత్వ విద్య పరిరక్షణకు పోరాడుతాం

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని శేరిలింగంపల్లి మండల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కొత్తగూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి మండల అధ్యక్షుడు టి. నితీష్, కార్యదర్శి ధర్మతేజ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం విద్యార్థులను ఏకం చేసి పోరాటాలు సాగించిన తొలి విద్యార్థి సంఘంగా ఏఐఎస్ఎఫ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బబ్రుద్దీన్, ప్రేమ్ నారాయణ భార్గవ్ తదితరుల నాయకత్వంలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందని తెలిపారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, ఆజాద్ తదితర అమరవీరుల ఆశయ సాధన కోసం పోరాటాలు, త్యాగాలను ధ్యేయంగా చేసుకుని సంఘం ముందుకు సాగిందన్నారు.

స్వాతంత్ర్యం అనంతరం ప్రభుత్వ విద్య పరిరక్షణ, శాస్త్రీయ విద్య, ఉమ్మడి విద్యా విధానం అమలు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తోందన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు విద్యార్థుల సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల అభివృద్ధితోపాటు పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల విద్యా హక్కుల కోసం సంఘం నిరంతరం పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ విద్యా విధానం పెరిగిపోతున్నా.. దాన్ని నియంత్రించడంలో ప్రభుత్వాలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నితీష్, ధర్మతేజ ఆరోపించారు. డబ్బున్న వారికి నాణ్యమైన విద్య, పేదలకు అందని విద్యగా పరిస్థితులు మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధానాలకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here