శేరిలింగంపల్లి, ఆగస్టు 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లో ఏటీఎం చోరీకి యత్నించిన నిందితుల కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 11న మియాపూర్ ఎక్స్ రోడ్‌లోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎంలో చోరీకి ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారు. తెల్లవారుజామున సుమారు 2.30 గంటలకు ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించిన నిందితులు ఇనుప రాడ్లు, రాళ్లతో ఏటీఎం యంత్రాన్ని పగులగొట్టేందుకు ప్రయత్నించారు. ఉదయం 5.40 గంటల సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏటీఎంలోని నగదు దొంగిలించడంలో విఫలమైనప్పటికీ.. బ్యాకప్ బ్యాటరీలు మాత్రం కనిపించకుండా పోయాయి. ఏటీఎం వద్ద భారీగా నష్టం వాటిల్లింది.

ఫిర్యాదు అందుకున్న వెంటనే మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీతోపాటు ఇతర ఆధారాలను విశ్లేషించారు. దర్యాప్తు ఆధారంగా నిందితులను గుర్తించి ప్రత్యేక బృందంతో గాలింపు చేపట్టారు. చివరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన నిందితుల్లో మియాపూర్ జనప్రియలో ఉంటూ సెంటరింగ్ పనులు చేసే సంజీవ్ జాదవ్ (40), మియాపూర్ మక్తా పీఏ నగర్లో నివాసం ఉంటూ కూలీగా పనిచేస్తున్న రాపాక సూర్య ప్రకాశ్‌రావు (55) ఉన్నారు. మియాపూర్ న్యూ కాలనీకి చెందిన వదిత్య కార్తిక్ (22) ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈజీ మనీ కోసం ఏటీఎంలలో చోరీ చేయాలని నిందితులు ముందుగానే ప్రణాళిక రూపొందించుకున్నట్లు పోలీసులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లు తక్కువగా ఉన్న ఏటీఎంలను గుర్తించేవారు. ఒకరు బయట కాపలాగా ఉండగా, మరో ఇద్దరు ఇనుప రాడ్లతో ఏటీఎంలోకి ప్రవేశించి నగదు ఉన్న యంత్రాన్ని పగులగొట్టేందుకు ప్రయత్నించేవారు. మియాపూర్ ఘటనలో ఏటీఎం యంత్రాన్ని తెరవలేకపోవడంతో నగదు దొంగిలించలేకపోయారు.
ఏటీఎంల వద్ద పనిచేసే సీసీటీవీ కెమెరాలు, తగిన లైటింగ్, అలారం వ్యవస్థలు ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన చోట భద్రతా సిబ్బందిని నియమించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. సీసీటీవీ వ్యవస్థలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి, రికార్డింగులను భద్రంగా భద్రపరచాలని కోరారు. ఏటీఎం వద్ద అనుమానాస్పద కదలికలు, యంత్రాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాలు లేదా అనధికార ప్రవేశం గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాత్రి వేళల్లో ఏటీఎంలను తరచుగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఈ కేసు ఛేదనలో మియాపూర్ ఇన్స్పెక్టర్ ఎన్. జయరామ్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ డి. విజయ్ నాయక్, ఎస్ఐ బి. నరసింహారెడ్డి, క్రైమ్ సిబ్బంది ప్రేమ్‌కుమార్, చి. యాదయ్య, డి. చంద్రశేఖర్, కీర్తికుమార్, పూర్ణచందర్, మల్లికార్జున్, రుషేశ్వర్, స్వప్న తదితరులు పాల్గొన్నారు. కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్, అదనపు డీసీపీ ఎం. సుదర్శన్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు జరిగింది.





