శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (నమస్తే శేరిలింగంపల్లి): పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కేపీహెచ్‌బీ 7, 9 ఫేజ్‌లు, గోకుల్ ప్లాట్స్ మధ్య ఉన్న 5.87 ఎకరాల స్థలంలో రూ.43.20 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన కేపీహెచ్‌బీ పరిధిలో పేదల కోసం ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషకరమైన విషయమన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టిందని తెలిపారు. ప్రతిపాదిత ప్రాజెక్టులో ఒక్కో టవర్‌లో 120 ఫ్లాట్ల చొప్పున నాలుగు టవర్లలో మొత్తం 480 ఫ్లాట్లు నిర్మించనున్నట్లు గాంధీ వివరించారు. ఒక్కో ఫ్లోర్లో 12 ఫ్లాట్లు ఉండేలా నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేసి లబ్ధిదారులకు గృహప్రవేశాలు జరిగేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఇందిరమ్మ టవర్స్‌లో నిర్మించే ప్రతి ఇంటి విస్తీర్ణం సుమారు 525 చదరపు అడుగులు ఉండనుంది. ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్‌తో పాటు అవసరమైన సౌకర్యాలతో ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా ఇళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న ఈ ఇళ్లకు లబ్ధిదారుడి పేరుతో అన్‌డివైడెడ్ షేర్ కింద సుమారు 20 నుంచి 25 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు వెల్లడించారు.

అర్హులైన పేదలకు ఇళ్ల కేటాయింపును పూర్తిగా పారదర్శకంగా చేపట్టేందుకు లక్కీడిప్ విధానాన్ని అమలు చేయనున్నట్లు గాంధీ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. గోకుల్ ప్లాట్స్, ప్రజయ్ మెగా పోలీస్ అపార్ట్మెంట్స్, మహేంద్ర అశ్విత అపార్ట్మెంట్స్, సైప్రస్ ఫామ్ విల్లాస్‌కు సంబంధించిన ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే గాంధీ తీసుకెళ్లారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు గాంధీ తెలిపారు. హైదరాబాద్‌లో భూముల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో నగరంలోనే సొంత ఇల్లు పొందాలన్న పేదల ఆకాంక్షను నెరవేర్చేందుకు ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని గాంధీ అన్నారు.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున పేదవాడి ఇంటికి పునాది వేయడం అంటే కేవలం ఒక భవనం నిర్మించడం కాదని, ఒక కుటుంబానికి భద్రత, ఒక తరానికి భరోసా, పేదవాడికి గౌరవంతో కూడిన జీవితం అందించడం అని గాంధీ పేర్కొన్నారు. క్యూర్ పరిధిలో చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం హైదరాబాద్ గృహ నిర్మాణ రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆయన అన్నారు.





