శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్‌లోని రేగుల కుంట స.నం.151లో ఉన్న భూమి ప్రభుత్వ భూమిగా తహసీల్దార్, ఆర్డీవో, ఏడీ స్థాయి అధికారుల నివేదికల్లో స్పష్టమైనప్పటికీ అక్కడ నిర్మాణాలు ఎలా కొనసాగుతున్నాయని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేగుల కుంట సర్కారీ భూమి, హఫీజ్‌పేట్ సర్వే నంబర్ 151గా అధికారిక నివేదికల్లో తేలిన నేపథ్యంలో నిర్మాణాలను ఎందుకు అడ్డుకోవడం లేదని శేరిలింగంపల్లి తహసీల్దార్ మహిపాల్ రెడ్డిని కసిరెడ్డి భాస్కరరెడ్డి ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. దీంతో తహసీల్దార్ కార్యాలయంలో ఈ అంశంపై కదలిక వచ్చిందని భాస్కరరెడ్డి తెలిపారు.

నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం: తహసీల్దార్
జీహెచ్ఎంసీ అనుమతులను రద్దు చేయాలని లేఖ రాస్తున్నామని, ఈ వ్యవహారంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని తహసీల్దార్ మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూమిలో జరుగుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకుని భూమిని పరిరక్షిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి డిప్యూటీ తహసీల్దార్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ భూమిని కబ్జాలకు గురికాకుండా కాపాడేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కసిరెడ్డి భాస్కరరెడ్డి కోరారు.





