వివేకానంద నగర్‌లో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో వన్ డే.. వన్ వార్డ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివేకానంద నగర్ రీక్రియేషన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కాలనీల్లో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన, జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, డీసీ చాముండేశ్వరి, వివిధ విభాగాల అధికారులు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ వన్ డే.. వన్ వార్డ్ కార్యక్రమం ద్వారా కాలనీల రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యలను నేరుగా CMC అధికారుల దృష్టికి తీసుకువచ్చే అవకాశం కలిగిందన్నారు. కాలనీవాసులు ప్రస్తావించిన సమస్యలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా వేగం పెంచాలని సూచించారు. వివేకానంద నగర్ డివిజన్‌లో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీరు వంటి మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని గాంధీ తెలిపారు. కాలనీల్లోని పార్కులను ఆధునిక వసతులతో అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దుతామని, ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పిల్లలు, వృద్ధులు సేదతీరేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడంతోపాటు కాలనీల్లో ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న, అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గాంధీ కమిషనర్ సృజనను కోరారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను సకాలంలో మంజూరు చేయాలని, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని, దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అసంపూర్తిగా ఉన్న నాలాల విస్తరణ పనులను పూర్తి చేయాలని, వరద నీరు, వర్షపు నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చర్యలు చేపట్టాలని గాంధీ సూచించారు. ప్రతి కాలనీలోని పార్కుల అభివృద్ధి, సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వివేకానంద నగర్ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా పనిచేస్తానని గాంధీ తెలిపారు.

ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవాలని గాంధీ సూచించారు. ఇంకుడు గుంతల ఏర్పాటును ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య ఆటో సిబ్బందికి అందించాలని సూచించారు. కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి కుప్పలను ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని CMC పారిశుధ్య సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో CMC ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, జలమండలి విభాగాల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here