కేపీహెచ్‌బీలో పేదల కోసం ఇందిరమ్మ టవర్స్‌.. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదరాబాద్ నగరంలో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాల కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. కేపీహెచ్‌బీ 7, 9వ ఫేజ్‌, గోకుల్ ప్లాట్స్‌ మధ్య ఉన్న 5.87 ఎకరాల ప్రభుత్వ స్థలంలో రూ.43.20 కోట్ల వ్యయంతో నాలుగు ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి గురువారం భూమిపూజ నిర్వహించనున్నారు. గురువారం (ఆగస్టు 13) సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ, శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

కార్యక్రమ ఏర్పాట్లను PAC చైర్మన్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బుధవారం పరిశీలించారు. కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌, TPCC ఉపాధ్యక్షుడు బండి రమేష్‌, యాదవ కో-ఆపరేటివ్‌ చైర్మన్‌ రఘునాథ్‌ యాదవ్‌, డీసీపీ రీతిరాజ్ తోపాటు అధికారులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ టవర్స్‌ ద్వారా శిలాఫలకం పడబోతోందన్నారు. అత్యంత ఖరీదైన కేపీహెచ్‌బీ ప్రాంతంలో ప్రభుత్వ స్థలంలో పేదల కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ప్రాజెక్టును ఒక ఏడాదిలో పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఫేజ్‌-1 కింద 480 ఇళ్లు, ఫేజ్‌-2 కింద 680 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

భూమిపూజ చేయనున్న ప్రాజెక్టులో నాలుగు టవర్లు నిర్మించనున్నారు. ఒక్కో టవర్‌లో 120 ఫ్లాట్లు ఉండేలా, ఒక్కో అంతస్తులో 12 ఫ్లాట్ల చొప్పున నిర్మాణం చేపట్టనున్నట్లు గాంధీ తెలిపారు. ఇందుకోసం రూ.43.20 కోట్ల వ్యయం చేయనున్నట్లు చెప్పారు. లబ్ధిదారులకు అందించే ఇళ్లను ఆధునిక ప్రమాణాలతో నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక్కో ఇంటిలో బెడ్‌రూమ్‌, హాల్‌, కిచెన్‌తో కలిపి సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండనుంది. ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న ఈ ఇళ్లలో లబ్ధిదారుడి పేరుతో అన్‌డివైడెడ్ షేర్‌ (UDS) కింద సుమారు 20 నుంచి 25 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన పేదలను పారదర్శకంగా ఎంపిక చేసి, లక్కీడిప్‌ ద్వారా ఇళ్ల కేటాయింపు చేపట్టనున్నట్లు తెలిపారు. నగరంలో భూముల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్‌లోనే పేదలకు సొంతింటి అవకాశం కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గాంధీ పేర్కొన్నారు. నగరం నడిబొడ్డున పేదవాడి ఇంటికి పునాది వేయడం కేవలం భవనం నిర్మించడం కాదు.. ఒక కుటుంబానికి భద్రత, ఒక తరానికి భరోసా, పేదవాడికి గౌరవంతో కూడిన జీవితం అందించడం అని ఆరెకపూడి గాంధీ అన్నారు. ఇందిరమ్మ టవర్స్‌ భూమిపూజ కార్యక్రమానికి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని గాంధీ విజ్ఞప్తి చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here