మల్కం చెరువు ప్రభుత్వ స్థలంపై బీఆర్‌ఎస్‌ నిరసన.. సీబీఐ విచారణకు డిమాండ్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మల్కం చెరువు ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడంపై బీఆర్‌ఎస్‌ నేతలు నిరసన వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్‌లోని స్థలం వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, ఎమ్మెల్సీ, ఉద్యమ నాయకుడు శంభీపూర్‌ రాజు, శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ కార్పొరేటర్‌ మాధవరం రంగారావు ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా మాధవరం రంగారావు మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ స్థలాన్ని పీఎం ఏక్తా మాల్‌ నిర్మాణానికి కేటాయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.200 కోట్లను వడ్డీ రహిత రుణం రూపంలో మంజూరు చేసిందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో తయారయ్యే స్థానిక ఉత్పత్తులు, చేనేత, హస్తకళలు, సంప్రదాయ కళలకు ఒకే వేదిక కల్పించాలనే ఉద్దేశంతో పీఎం ఏక్తా మాల్‌ను నిర్మించాలని నిర్ణయించినట్లు వివరించారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ స్థలాన్ని అపర్ణ, వంశీరామ్‌ బిల్డర్స్‌ వంటి ప్రైవేట్‌ సంస్థలకు తక్కువ శాతం రుసుముతో అప్పగించిందని రంగారావు ఆరోపించారు. ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడం దారుణమైన చర్య అని విమర్శించారు.

ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి సీబీఐ విచారణకు అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో ప్రాజెక్టు ఉద్దేశాన్ని పక్కన పెట్టి ప్రైవేట్‌ సంస్థలకు ప్రయోజనం కల్పించేలా వ్యవహరించడం వల్ల తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా చేనేత, హస్తకళలు, సంప్రదాయ కళలపై ఆధారపడిన వారికి అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై పునరాలోచించి పీఎం ఏక్తా మాల్‌ అసలు లక్ష్యాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని, చేనేత, హస్తకళాకారులకు న్యాయం చేయాలని రంగారావు కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సాయిబాబా, నవతారెడ్డి, సీనియర్‌ నాయకులు పురుషోత్తం యాదవ్‌, గొట్టుముక్కుల పెద్ద భాస్కరరావు, మాచర్ల భద్రయ్య, హరీష్‌రావు, రవి యాదవ్‌, సతీష్‌రావు, శ్రీనివాస్‌ గౌడ్‌, రవీందర్‌ యాదవ్‌, అనిల్‌రెడ్డి, శ్రీకాంత్‌, రోజా, మమత, కార్తీక్‌రెడ్డి, శివరాజ్‌, మల్లేష్‌, మల్లారెడ్డి, నరేందర్‌ యాదవ్‌, విజయ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కొండలరావు, జగదీష్‌గౌడ్‌, బాబు, విక్రమ్‌, విద్యాసాగర్‌, వాసు, జైకుమార్‌, నరేష్‌, మోహన్‌చారి, హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here